గాయపడిన యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

గాయపడిన యువకుడి మృతి

Published Sat, Oct 28 2023 12:56 AM

- - Sakshi

నిమ్మనపల్లె : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మండలంలోని ముష్టూరు పంచాయతీ గౌనివారిపల్లెకు చెందిన కె.వెంకటరమణ కుమారుడు కె.గజేంద్ర(22) ఈ నెల 25న ద్విచక్రవాహనంలో పక్కగ్రామమైన దిగువపల్లెకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, గ్రామ సమీపంలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అపస్మారకస్థితిలో ఉన్న గజేంద్రను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిమ్మనపల్లె పోలీసులు తెలిపారు.

టమాట పంటపై

అడవి పందుల దాడి

రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయతీ కర్ణపువాండ్లపల్లెకు చెందిన రైతు వంగిమళ్ల భాస్కర్‌రెడ్డి జాతీయ రహదారి పక్కన ఎకరా పొలంలో టమాట పంట సాగు చేశాడు. బాగా కోత కొచ్చే సమయంలో గురువారం రాత్రి అడవి పందులు పంటపై విచ్చలవిడిగా దాడి చేసి నాశనం చేశాయని రైతు వాపోయాడు. పంట పెట్టుబడి కోసం సుమారు రూ.50 వేలు ఖర్చు చేశానని తెలిపాడు. తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు.

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

గుర్రంకొండ : గుర్రంకొండ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ బి.విశ్వనాథ్‌ను జిల్లా ఎస్పీ కృష్ణారావు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. బి. విశ్వనాథ్‌ ఈ ఏడాది జూన్‌లో పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్‌ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో జూదరులతో సన్నిహిత సంబంధాలతో పాటు జూదరలకు సహకరిస్తున్నాడనే ఆరోపణలు రావడం, అవి రుజువు కావడంతో సస్పెండ్‌ చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మార్చురీలో గుర్తుతెలియని మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌) మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వున్నట్లు ఆర్‌ఎంఓ డాక్టర్‌ శ్రీనివాసులు శుక్రవారం తెలియజేశారు. ఆచూకీ తెలిసిన బంధువులు ఎవరైనా వుంటే వారు తమను సంప్రదించాలనీ ఆయన కోరారు.

చెల్లా చెదురు అయిన పంట
1/2

చెల్లా చెదురు అయిన పంట

గజేంద్ర(ఫైల్‌)
2/2

గజేంద్ర(ఫైల్‌)

Advertisement
Advertisement