తెలుగు సాహిత్యానికి వెలుగునిచ్చిన బ్రౌన్‌ | Sakshi
Sakshi News home page

తెలుగు సాహిత్యానికి వెలుగునిచ్చిన బ్రౌన్‌

Published Fri, Nov 10 2023 5:30 AM

సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం (ఇన్‌సెట్‌) బ్రౌన్‌ (ఊహా) చిత్రం 
 - Sakshi

కడప కల్చరల్‌ : తెలుగు సాహిత్యానికి చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ మరింత వెలుగుతెచ్చారు. ఆయన తెలుగుజాతి కి లభించిన ఓ వరం. శుక్రవారం బ్రౌన్‌ 225వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. సి.పి. బ్రౌన్‌ 1798 నవంబర్‌ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్‌ బ్రౌన్‌ పేరొందిన వి ద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌన్‌ కు టుంబం ఇంగ్లండ్‌ వెళ్లింది. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో సీ పీ బ్రౌన్‌.. గ్రీక్‌, లాటిన్‌, పారశీ, సంస్కృత భాషల్లో ఆ రితేరాడు. అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగస్టు 4న మద్రాసులో ఈస్ట్‌ ఇండి యా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్య తల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానం సంపాదించాడు.

సీపీ బ్రౌన్‌ పేరిట భాషా పరిశోధన కేంద్రం

1820 ఆగస్టులో కడప జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. 1824 నుంచి తెలుగు కావ్యాల అధ్యయనం ప్రారంభించి పట్టు సాధించారు. బదిలీ అనంతరం 1826లో కోర్టు రిజిస్ట్రార్‌గా మళ్లీ జిల్లాకు వచ్చారు. కడప నగరం ఎర్రముక్కపల్లెలో బంగళాను ఏర్పాటు చేసుకుని తెలుగుభాషోద్దరణకు దాన్ని కార్యస్థానంగా మార్చారు. పలువురు పండితులకు జీతభత్యాలు ఇస్తూ తాను సేకరించిన గ్రంథాలకు శుద్ధ ప్రతులను రాయించారు. తాళపత్రాలలో శిథిలమవుతున్న ఎన్నో తెలుగు కావ్యాలను.. ఐజ్యపురం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. ఫ్రెంచ్‌ రచయిత ‘అబె దుబయ్‌’ ద్వారా బ్రౌన్‌.. వేమన, ఆయన పద్యాల ఘనతను తెలుసుకుని మక్కువ పెంచుకున్నాడు. వేమన పద్యాలున్న తాళపత్రాలను సేకరించి సొంత ఖర్చుతో ఆంగ్లంలోకి అనువదించారు. సీపీ బ్రౌన్‌ కార్యశాలగా నిలిచిన ఆ ప్రాంతం నేడు ఆయన స్మారకంగా మనం గర్వించదగిన గ్రంథాలయంగా రూపుదిద్దుకున్నది. తెలుగునాట ప్రతి భాషా ప్రియుడు గర్వంగా చెప్పుకోదగిన సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంగా పేరుపొందింది. లక్షకు పైగా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలు, 200కు పైగా అపురూపమైన తాళపత్ర గ్రంథాలు, తామ్ర పత్రాలు, నాణేలు లాంటి పుష్కలమైన వారసత్వ సంపదకు నిలయంగా మారింది.

మానవతావాది

● బ్రౌన్‌ కడప నగరంలో రెండు, బందరులో రెండు, మద్రాసులోని ఎగ్మోర్‌లో ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. తెలుగుతోపాటు ఉర్దూ, పార్శి నేర్పారు.

● మన జిల్లాలో ఓమారు 11 మంది దోషులకు 355 జరిమానా విధించగా తానే చెల్లించి వారిని విడుదల చేయించారు. ఒక ఉర్దూ మున్షి అప్పుల్లో ఉండగా రూ.1000 చెల్లించి రుణ విముక్తిని చేశాడు.

● కరువు సమయాల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ఆయన గుంటూరుకు బదిలీ అయ్యాక ఇక్కడ కరువు వచ్చిందని తెలిసి.. తన సహాయకుడు కృష్ణారెడ్డికి గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

● వికలాంగులు, అంధులు, నిరుపేదలు, అనాథలు, వృద్ధులకు ధర్మ భోజనం పేరుతో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. పూటకూళ్ల సత్రాలకు ప్రతినెల తానే బిల్లు చెల్లించాడు.

మొండి గోడల నుంచి..

డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి.. ప్రముఖ రచయితలు బంగోరే, ఆరుద్రల సూచనల మేరకు బ్రౌన్‌ నివసించిన మేడ శిథిలాలు గల స్థానంలోనే బ్రౌన్‌ పేరిట స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆయనకు బ్రౌన్‌ శాస్త్రి అనే పేరు వచ్చింది. బ్రౌన్‌ గ్రంథాలయంలోని సమావేశ మందిరానికి బ్రౌన్‌ శాస్త్రి అని పేరు పెట్టారు. డాక్టర్‌ జానమద్ది తన మిత్రుడు మైనంపాటి సుబ్రమణ్యం ద్వారా బ్రౌన్‌ ఊహా చిత్రాన్ని రూపొందింపజేసి.. తెలుగు సాహితీ లోకానికి అపూర్వమైన కానుకగా అందజేశారు.

మరో భవనానికి ముఖ్యమంత్రి చర్యలు

మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రౌన్‌ గ్రంథాలయాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్రౌన్‌ గ్రంథాలయాన్ని ఇటీవల సందర్శించినపుడు విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. విస్తరణకు రూ. 5 కోట్లు అవసరమవుతాయని తెలుపగా, ముఖ్యమంత్రి వెంటనే ఆ మొత్తాన్ని మంజూరు చేశారు. ఆ తర్వాత పెరిగిన సొమ్మును కూడా మంజూరు చేసి నూతన భవన నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతో తెలుగుభాషా ప్రియులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు సి.పి.బ్రౌన్‌ 225వ జయంతి

1/1

Advertisement
Advertisement