అప్రమత్తతతో.. ప్రమాదాలకు చెక్‌ | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతో.. ప్రమాదాలకు చెక్‌

Published Sun, Nov 12 2023 1:30 AM

- - Sakshi

విజయవాడ బస్టాండులో బస్సు దుర్ఘటన నేపథ్యంలో ఆర్టీసీ అప్రమత్తమైంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. 55 ఏళ్లకు పైబడి అనారోగ్య సమస్యలున్న డ్రైవర్లను దూర ప్రాంత సర్వీసులకు పంపకూడదని నిర్ణయించారు. ఆ సర్వీసుల్లో ఎక్కువగా రాత్రి విధులు నిర్వహించాల్సి వస్తుండడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.

రాజంపేట : అన్నమయ్య జిల్లాలో రాజంపేట, పీలేరు, రాయచోటి, మదనపల్లె–1, మదనపల్లె–2 డిపోలు ఉన్నాయి. వీటి నుంచి మొత్తం 498 బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపు తున్నారు. ఇందులో ఆర్టీసీ సొంత బస్సులు 358 కాగా, అద్దెకు తీసుకున్నవి 140 ఉన్నాయి. వీటిని నడిపే సిబ్బందిలో కొందరు వయసు మీరిన వారే ఉన్నారు. ప్రమాదాలను నివారించేందుకు ఆర్టీసీ అధికారులు కొన్ని నిబంధనలు పాటించాలని భావిస్తున్నారు. విజయవాడలో బస్సు అదుపు తప్పి ప్లాట్‌ ఫాంపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అటువంటి ప్రమాదాలకు తావు లేకుండా చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్లాట్‌ఫాంల వద్ద కాంక్రీట్‌ స్టాపర్లును ఏర్పాటు చేయనున్నారు. బస్సు అదుపు తప్పి దూసుకొస్తే ప్లాట్‌ఫాంపైకి వెళ్లకుండా ఇవి అడ్డుకుంటాయని ఆలోచన చేస్తున్నారు.

అరోగ్యంగా ఉన్నవారినే..

ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్ల అంగీకారంతోనే పగటి పూట నడిచే దగ్గర ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు కేటాయిస్తారు. వారి స్థానంలో 55 ఏళ్ల వయస్సులోపు ఉన్న డ్రైవర్లను పంప నున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న డ్రైవర్లను అత్యవసర సమయాల్లో దూర ప్రాంత సర్వీసులకు పంపేవారు. ఇప్పుడు వారిని ఆ సర్వీసులకు పంపడం లేదు. సీనియర్‌ డ్రైవర్లు దూర ప్రాంత సర్వీసులకే గానీ, దగ్గర రూటు/పల్లె వెలుగులో విధులు నిర్వహించ డానికి ఆసక్తిచూపరు. విజయవాడ బస్సు ప్రమాదంతో ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం పలు నిర్ణయాలు తీసుకోవడం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిబంధనల అమలు

సాధారణంగా బస్సు చిన్నపాటి ప్రమాదానికి గురైనా సంబంధిత బస్సు డ్రైవర్‌కు ఆర్టీసీలో శిక్షణకు పంపిస్తుంటారు. విజయవాడ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఔట్‌ సోర్సింగ్‌ , అద్దె బస్సుల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ శిక్షణలో ఒక పూట థియరీ, మరోపూట నిపుణుల సమక్షంలో డ్రైవింగ్‌ పరిశీలన ఉంటుంది. ప్రమాదాల నివారణపై మెలకువలను నేర్పిస్తారు. ఆర్టీసీ, అద్దె బస్సు, ఔట్‌ సోరింగ్‌ డ్రైవర్లందరికీ దశల వారీగా శిక్షణ ఇప్పించాలని ఆర్టీసీ యోచిస్తోంది. ప్రయాణికుల పట్ల ఆర్టీసీ డ్రైవర్ల ప్రవర్తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందుతున్నాయి. ఇలాంటి వారు సత్ప్రవర్తనతో మెలిగేలా నిపుణులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు.

ప్రతి డిపోలో బ్రేక్‌ సిస్టమ్స్‌పై సెన్సస్‌

ప్రతి డిపోలో బ్రేక్‌ సిస్టమ్స్‌ సెన్సస్‌ తీయనున్నాం. రోడ్డెక్కాలంటే ఎఫ్‌సీ తప్పనిసరి. పీఎంఈ(పీరియాడికల్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌) లేకుండా సర్వీసులు ఇవ్వడం లేదు. 55కు పైబడిన డ్రైవర్లను దూర ప్రాంత సర్వీసులకు పంపేలా జాగ్రత్తలు పాటిస్తాం. రీజనల్‌ స్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారంలో డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. – రాము,

జిల్లా ప్రజారవాణా అధికారి, రాయచోటి

దూర ప్రాంత సర్వీసుల నడపడం లేదు

నా పేరు రంగప్ప. నా వయస్సు ఇప్పుడు 61 ఏళ్లు. సర్వీసులో డిపో బెస్ట్‌ కెఎంపీఎల్‌ సాధించాను. ఆర్టీసీ అధికారులు 55కు పైబడి తమలాంటి వారికి దూర ప్రాంత సర్వీసులు కేటాయించడంలేదు. తాను అయితే దగ్గర ప్రాంతస ర్వీసులు తిరుగుతున్నా. ముందుగా నేను బ్రేక్‌ చూసుకుంటాను. ఆ తర్వాత రోడ్డెక్కుతాను.

– రంగప్ప, సీనియర్‌ డ్రైవర్‌, రాజంపేట డిపో

విజయవాడ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీసీ అప్రమత్తం

55 ఏళ్లకు పైబడిన వారికి దగ్గర గ్రామాలకు విధుల కేటాయింపు

సెప్టీ డ్రైవింగే ధ్యేయంగా చర్యలకు

సిద్ధమవుతున్న ప్రభుత్వం

ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్ల ప్రవర్తన,

భద్రత పెంపుపై ప్రత్యేక నిఘా

1/2

2/2

Advertisement
Advertisement