నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సమస్యలు | Sakshi
Sakshi News home page

నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సమస్యలు

Published Wed, Nov 15 2023 1:50 AM

పగిలి పోయిన పైపు ఉన్న ప్రదేశంలో 
పని చేస్తున్న జేసీబీ  - Sakshi

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం అయిన పంప్‌ హౌస్‌ నిర్మాణంలో అప్పటి ప్రభుత్వం టీడీపీ చేసిన నిర్లక్ష్యం వల్లే నేడు ఈ పైపులు పగిలి పోవడానికి కారణమని శ్రీరామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ చైర్మన్‌ ఆకేపాటి శివారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల నుంచి మండలంలో వర్షపాతం అధికంగా కురిసి ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు ఉండేవని తెలిపారు. అదే విధంగా ఒంటిమిట్టలో ఉన్న చెరువులో కూడా ఈ నాలుగు సంవత్సరాలు వర్షాలు బాగా కురవడంతో నీళ్లు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని కోటపాడు వద్ద ఉన్న శ్రీరామ ఎత్తిపోతల పథకం అయిన పంప్‌ హౌస్‌ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు వదలే అవసరం రాలేదన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత 2023లో వర్షపాతం తక్కువ కావడంతో ఇన్నాళ్లకు ఒంటిమిట్ట చెరువులో నీరు ఇంకి పోయాయన్నారు. అందువల్ల ఒంటిమిట్ట చెరువుకు ఇన్ని సంవత్సరాల తరువాత కోటపాడు లోని ఎత్తిపోతల పథకం అయిన పంప్‌ హౌస్‌ నుంచి గత నెల 15వ తేదీన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి చొరవతో ఒంటిమిట్ట చెరువుకు సోమశిల వెనుక జలాలను వదిలారన్నారు. ఇక పంప్‌ హౌస్‌ నుంచి నీళ్లు వదిలినప్పుడు పైపులు పగిలిపోతున్నాయన్నారు. అది కూడా ఎందుకంటే ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం నిర్మాణం అప్పటి ప్రభుత్వం తెలుగు దేశం పార్టీ హయాంలో జరిగిందని తెలిపారు. నాసిరకమైన సిమెంట్‌ పైపులను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అందువల్లే గత నెల 15 నుంచి మోటార్లు వేసిన ప్రతి సారి సిమెంట్‌ పైపులు పగిలిపోవడం, వాటి స్థానంలో తాము ఇనుప పైపులు వేయడం జరుగుతుందన్నారు. ఆ సమస్య పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల ద్వారా ఎస్టిమేషన్‌ వేయించి పంపించామన్నారు.

శ్రీరామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ చైర్మన్‌ శివారెడ్డి

Advertisement
Advertisement