ఐదు పోలీసు స్టేషన్ల అప్‌గ్రేడ్‌ | Sakshi
Sakshi News home page

ఐదు పోలీసు స్టేషన్ల అప్‌గ్రేడ్‌

Published Fri, Nov 24 2023 1:40 AM

ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలిస్తున్న ఆర్‌ఎం రాము   - Sakshi

బి.కొత్తకోట: జిల్లాలో ఐదు పోలీస్‌స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బి.కొత్తకోట, కోడూరు, మన్నూరు, కలికిరి, రాయచోటి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లు అప్‌గ్రేడ్‌ అయ్యాయి. ప్రస్తుతం స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా ఎస్‌ఐలు విధులు నిర్వహిస్తుండగా, ఇకపై సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తారు. ఇకపై ఈ స్టేషన్లలో విధులు నిర్వహించే సీఐలకు సర్కిల్‌ ఉండదు.

నేడు బి.కొత్తకోటలో

‘జగనన్నకు చెబుదాం’

బి.కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హజరవుతారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం కోసం ఎంపీడీఓ శంకరయ్య ఏర్పాట్లు చేస్తున్నారు.

26న బ్యాడ్మింటన్‌ ఎంపికలు

రాజంపేట టౌన్‌: ఈనెల 26వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఉమ్మడి వైఎస్సార్‌జిల్లా బాల్‌బ్యాడ్మింటన్‌ జట్లను ఎంపిక చేయనున్నట్లు ఆ క్రీడ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆకేపాటి శంకర్‌రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రావు, జిల్లా సెలక్షన్‌ కమిటీ కన్వీనర్‌ వై.నందకిషోర్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అనంతపురంలో జరిగే పురుషుల, మహిళల సీనియర్‌ బాల్‌బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. సెలక్షన్‌ కోసం వచ్చే క్రీడాకారులు వైట్‌ అండ్‌ వైట్‌ దుస్తులు వేసుకొని రావాలన్నారు. అలాగే ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీతో సెలక్షన్‌ రోజున ఉదయం 9 గంటల నుంచి పది గంటల లోపు క్రీడా మైదానానికి చేరుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9398865739 నంబరులో సంప్రదించాలని కోరారు.

ఆర్టీసీకి పెరిగిన ఆదాయం

పీలేరు రూరల్‌: జిల్లాలో ఆర్టీసీకి రూ.4 కోట్లు ఆదాయం పెరిగిందని ఆర్‌ఎం రాము అన్నారు. గురువారం ఆయన పీలేరు డిపోను, బస్టాండ్‌ను తనిఖీ చేశారు. అనంతరం డీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ. 170 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.174 కోట్లు వచ్చిందన్నారు. బస్సుల నిర్వహణలో మదనపల్లె 1 డిపో ప్రథమ, మదనపల్లె 2 డిపో ద్వితీయ, పీలేరు డిపో తృతీయ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. కాగా, కలకడ బస్టాండ్‌లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరైనట్లు, పీలేరు బస్టాండ్‌ పైకప్పు మరమ్మతుకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎం కుమార్‌, సీఐ సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదానానికి వైఎస్సార్‌ జిల్లాకు చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దువ్వురు మండలం పుల్లారెడ్డిపేటకు గ్రామానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ సలహాదారుడు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి గురువారం అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపాల్‌రెడ్డి, వీరమ్మల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను పాలక మండలి సభ్యులు కట్టా సత్తెయ్య, ఆలయ అధికారులు అందజేశారు.

ప్రమాణ స్వీకారం

చక్రాయపేట: ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌గా గురువారం కుప్పం ప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవదాయశాఖ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ కార్యాలయంలో చైర్మన్‌ కామేశ్వర రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాస్‌, జీఎం నాగసాయి తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రమాణ 
స్వీకారం చేస్తున్న కుప్పం ప్రసాదరావు
1/1

బ్రాహ్మణ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తున్న కుప్పం ప్రసాదరావు

Advertisement
Advertisement