ఘనంగా ప్రారంభమైన ఉరుసు | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన ఉరుసు

Published Tue, Apr 23 2024 8:35 AM

ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి, సోదరులు  - Sakshi

కమలాపురం : పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దర్గా పీఠాధిపతి (ముతవల్లి), సజ్జాద్‌–ఏ–నషీన్‌ మహమ్మద్‌ ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి ఆధ్వర్యంలో, అశేష భక్త జన సందోహం నడుమ ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్‌ జెండాను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్‌, చౌక్‌ సెంటర్‌ మీదుగా దర్గాకు చేరుకుంది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం నషాన్‌ జెండాను దర్గా ఆవరణంలో ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ ఉరుసు ఉత్సవాల ప్రారంభానికి సూచిక. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్త జనుల సమక్షంలో హజరత్‌ అబ్దుల్‌ గఫార్‌ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్‌ షా ఖాద్రి, హాజీ హజరత్‌ జహీరుద్ధీన్‌ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్‌లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ చేశారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్‌ పాక్‌, జియా, ఇస్మాయిల్‌, సర్ఫరాజ్‌, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్‌ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు.

నేడు గంధం : మంగళవారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్‌ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు.

గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం:

ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం అని పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉరుసు ఉత్సవాల్లో గంధోత్సవం అతి ముఖ్యమైన ఘట్టం అని, ఈ ఘట్టాన్ని భక్తులందరూ తప్పక వీక్షించాలన్నారు.

Advertisement
Advertisement