ఇది మా ఇల్లు.. మా జగనన్న ఇచ్చిన ఇల్లు | Sakshi
Sakshi News home page

ఇది మా ఇల్లు.. మా జగనన్న ఇచ్చిన ఇల్లు

Published Sat, Dec 9 2023 5:36 AM

Jagan Mohan Reddy is implementing the Navratna schemes in AP - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

అద్దె ఇంటి బాధలు తప్పాయి
నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపా­లిటీలోని చవటపాళెంలో ఆరేళ్లుగా అద్దె ఇంట్లో భారంగా నివశించేవాళ్లం. నా భర్త షరీఫ్‌ కారు డ్రైవర్‌. వచ్చే కొద్దిపాటి ఆదాయంలో సగానికిపైగా అద్దెకు పోయేది. మిగిలిన డబ్బులతో నెల మొత్తం తినీతినక గడుపుతూ వచ్చేవాళ్లం. సొంతిల్లనేది ఉంటే మాకు బాధలు తప్పుతాయనుకొనేవాళ్లం. దీంతో గత ప్రభుత్వంలో నివాసన స్థలం కోసం చాలా సార్లు నాయకులు, అధికార్లను సంప్రదించాం.

కాళ్లరి­గేలా తిరిగినా ఫలితం లేదు. అయితే జగన్‌­అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన వలంటీర్‌ నేరుగా మా ఇంటికి వచ్చి నివేశ స్థలం ఇస్తారని చెప్పారు. దరఖాస్తు చేయగానే మంజూరైందనే కబురు చెప్పారు. పక్కా ఇల్లు కూడా వచ్చిందని చెప్పడంతో నమ్మలేక పోయాము. తర్వాత గృహ నిర్మాణ శాఖ అధికారులు స్థలం, పొజిషన్‌ సర్టిఫికెట్‌తో పాటు పక్కా గృహం మంజూరు పత్రాన్ని అందజేయడంతో సంతోషించాం.

గాంధీనగర్‌ ప్రాంతంలోని జగనన్న అర్బన్‌ లేఅవుట్‌లో ఒకటిన్నర సెంటు స్థలం ఇవ్వడంతోపాటు పక్కా ఇల్లు కట్టుకోవడానికి అనుమతిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలే కాకుండా మా దగ్గర ఉన్న కొంత డబ్బుతో ఇంటిని అందంగా కట్టుకున్నాం. బెడ్‌రూమ్, హాల్, కిచెన్, వరండా, బాత్‌రూం నిర్మించుకున్నాం. ఇప్పుడు మాకు చాలా సౌకర్యవంతంగా ఉంది. మా సొంతింటి కల నెరవేరింది.   – షేక్‌ నూర్జహాన్, చవటపాలెం.(పి.రవి, విలేకరి గూడూరు రూరల్‌)

పెట్టుబడి సాయం ఆదుకుంది.. 
నాది నిరుపేద కుటుంబం. నా భార్య శాంతమ్మ, నేను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. ఈ క్రమంలో కూలి పనులు చేయలేక గత 20 సంవత్సరాలుగా ఆరు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. మూడు ఎక­రాల భూమిలో వరి, మరో మూడు ఎకరాల మెట్ట భూమిలో పత్తి పంటను సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించడంతో పాటు మా ఇద్దరు పిల్లల వివాహాలు కూడా చేశాను.

4 సంవత్సరాల క్రితం వరకు వ్యవసాయ సీజన్‌ వ­స్తోందంటే భయమేసేది. ప్రతి సంవత్సరం వ్య­వసాయ పనులను ప్రారంభించేందుకు నా భా­ర్య మెడలో పుస్తెలు తాకట్టు పెట్టి వడ్డీకి డబ్బు తెచ్చుకుని పంట సాగు ప్రారంభించే వాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా రూ 13,500 నగదు అందజేస్తోంది. దీంతో నాలుగేళ్లుగా ఆ డబ్బుతో వ్యవ­సాయానికి అవసరమైన విత్తనా­లు, ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేసుకుంటున్నా.

జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుస్తెలు తాకట్టు పెట్టే పరిస్థితి రాలేదు. పంట నష్టపోతే ప్రభుత్వం నష్టపరి­హారం కూడా అందిస్తోంది. కౌలు రైతులను కూడా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి నాలాంటి కౌలు రైతులందరూ రుణపడి ఉంటారు.  ప్రస్తు­తం నేను రూపాయి అప్పు లేకుండా వ్య­వసాయం చేసుకోగలుగుతున్నా. గ్రా­మా­ల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవడం చాలా బాగుంది.  – పాపట్ల కోటేశ్వరరావు, కేతవీరునిపాడు, నందిగామ మండలం, ఎన్టీఆర్‌ జిల్లా (మొవ్వా అనిల్‌కుమార్, విలేకరి, నందిగామ) 

నా బిడ్డకు ప్రాణం పోశారు
నాకుమార్తె మూడు రోజులు ఆస్పత్రిలో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఆపరేషన్‌ అవసరమని వైద్యులు చెప్పారు. మాది మధ్యతరగతి కుటుంబం. గుంటూరులోని కొత్తపేట మంగళబావి వీధిలో నివసిస్తున్నాం. నేను దివ్యాంగురాలిని కావడంతో ఏ పని చేయలేను. మా ఆయన డ్రైవర్‌.  మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఆయనకు వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం.

ఇంతకూ ఏం జరిగిందంటే.. 2022లో పదో తరగతి పరీక్షలు రాసిన పెద్ద కుమార్తె రూపసాయిశ్రీ నంబూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం ఆగలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో చేర్పించాం. ఎంత ఖర్చు అవుతుందోనని ఆందోళన చెందాం. బిడ్డ ప్రాణాలతో తిరిగి వస్తే చాలనుకున్నాం.

తలకు గాయం కావడంతో ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు సూచించారు. సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అంతమొత్తం ఎలా అని భయపడ్డాం. ఆ సమయంలో ఆరోగ్య శ్రీ ఆదుకుంది. ఈ పథకం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా  మెరుగైన వైద్యాన్ని అందించి వైద్యులు నా బిడ్డ ప్రాణాలు కాపాడారు. ఈ రోజు ఆమె మాతో ఉందంటే అదంతా సీఎం జగన్‌ చలువే. అమ్మ ఒడి అందడం వల్ల నా చిన్న కుమార్తె చక్కగా చదువుకుంటోంది. నాకు ప్రతి నెల రూ.3 వేలు దివ్యాంగ పింఛను అందుతోంది. అందరం ఆనందంగా ఉన్నాం.  – కుమార్తెలతో దళవాయి లక్ష్మీప్రసన్న,కొత్తపేట, గుంటూరు (పి.ప్రశాంత్‌ (నాని), విలేకరి, పట్నంబజారు)

Advertisement
Advertisement