తండ్రి అడుగుల్లో తనయి.. మొదటి గురువు ఆయనే.. ఆరేళ్లకే

13 Oct, 2021 17:25 IST|Sakshi
తండ్రి సురేష్, తనయి హరిణి నృత్యసాధన

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నృత్య ప్రదర్శనలు

ఎన్నో అవార్డులు... రికార్డులు

పోటీల్లో ప్రథమస్థానం తనదే

సాక్షి, నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆ చిన్నారికి పట్టుమని 11 ఏళ్లు. అయినా కూచిపూడి నాట్యకళాకారిణిగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నింటిలో ప్రదర్శనలు. గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో చోటు సాధించింది. చిన్నారి నృత్య, అభినయానికి పలువరి ప్రసంశలు కూడా అందుకుంది నెల్లూరుకు చెందిన నృత్యకారిణి విజయ హరిణి. 

తండ్రి అడుగుల్లో అడుగులువేసి....
మద్దులూరి సురేష్, అలేఖ్య దంపతులు నెల్లూరు రామలింగాపురం వాసులు. సురేష్‌ వెస్ట్రన్‌ డ్యాన్సర్‌గా రాణించి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. తండ్రి డ్యాన్సును చిన్నప్పటి నుంచి చూసిన హరిణికి డ్యాన్స్‌ పట్ల ఆసక్తి పెరిగింది. అది గమనించిన తండ్రి తానే కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుని తనయికి నేర్పాడు. తొలి గురువుగా తాను చేసి ప్రయత్నం ఫలించింది. అతి తక్కువ సమయంలోనే హరిణి నృత్యకళాకారిణిగా ఎదిగింది.


తండ్రి తనయుల నృత్య ప్రదర్శన, గిన్నీస్‌ బుక్‌లో స్థానం

నవరసాలను అభినయిస్తూ, కూచిపూడి నృత్యంలో వివిధ అంశాలపై నృత్య రూపకాలతో తన ప్రతిభను చాటింది. పిల్లలు  తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా ఎదిగితే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందోనని ఈ తండ్రి కూతుళ్లు తమ నృత్యంతోనే జవాబిచ్చారు. తండ్రి కూతుళ్ల బంధాన్ని నృత్యం మరింత పెనవేసింది. దీంతో విజయ హరిణి కూచిపూడి నృత్యకారిణిగా రాణిస్తుంది. విజయానికి తొలి అడుగు ఇంటి నుండే ప్రారంభమై దేశవ్యాప్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వాలని ఆ చిన్నారి ఆకాంక్ష. 


కాళికామాత అభినయంలో హరిణి

హరిణి నృత్య ప్రస్థానం ఇలా...
– 2016లో ఆరేళ్ల వయసులో నెల్లూరు టౌన్‌ హాలులో మొదటి ప్రదర్శనతో నృత్య కిషోర్‌ అవార్డును అందుకుంది.
– 2018లో తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో జాతీయ పోటీల్లో స్పెషల్‌ జ్యూరీ అవార్డు అందుకుంది. 
– 2018లో లేపాక్షిలో జరిగిన ఉత్సవాల్లో తెలుగు బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. 
– 2019లో హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో నృత్య తరంగిణి అవార్డును మాజీ గవర్నర్‌ రోశయ్య చేతులమీదుగా  అందుకుంది.
– 2019లో నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. 
– 2020లో చెన్నైలో త్యాగయ్య టీవీ ఆధ్వర్యంలో లార్జెస్ట్‌ కూచిపూడి లెవెన్‌లో తన తండ్రి సురేష్‌తో పాటు పాల్గొని గిన్నీస్‌బుక్‌ఆఫ్‌వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించింది.
– ప్రతి ఏడాది షిర్డీలో బాబా ఉత్సవాల్లో బాబా సమాధి వద్ద క్రమం తప్పని నృత్య ప్రదర్శన.


హరిణి నృత్య ప్రదర్శన
 

మరిన్ని వార్తలు