పేదలకు వరం ఫ్యామిలీ డాక్టర్‌ | Sakshi
Sakshi News home page

పేదలకు వరం ఫ్యామిలీ డాక్టర్‌

Published Tue, Mar 28 2023 1:28 AM

104 వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి విడదల రజిని, కలెక్టర్‌ శివశంకర్‌ - Sakshi

చిలకలూరిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన నూతన 104 మొబైల్‌ మెడికల్‌ వాహనాలను స్థానిక ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ వచ్చే నెల మొదటి వారంలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందు కోసం ఇప్పటికే నూతన 104 వాహనాలను సమకూర్చుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 వాహనాలను అన్ని జిల్లాలకు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 104 వాహనాలు 676 ఉన్నాయని, ఇప్పుడు వీటికి అదనంగా మరో 260 వాహనాలు వచ్చి చేరాయని చెప్పారు.

విజయవంతంగా ట్రయల్‌ రన్‌...

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి రజిని చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లను జగనన్న అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానంలో ఈ విలేజ్‌ క్లినిక్‌లు కీలకంగా మారనున్నాయని చెప్పారు. ప్రతి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉండేలా నియామకాలు పూర్తి చేశామని, వీరిలో డాక్టర్‌ కచ్చితంగా మొబైల్‌ వాహనం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందజేస్తారన్నారు. ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్‌ ప్రకారం గ్రామాల్లో 104 వాహనం ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. ప్రతి గ్రామానికి నెలలో రెండు సార్లు వచ్చేలా కార్యక్రమం రూపొందించినట్లు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించటం ఉచితంగా చికిత్స అందించటం వైద్యుల విధి అని పేర్కొన్నారు. ఏకంగా 14రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారని చెప్పారు. ప్రస్తుతానికి 67 రకాల మందులు కూడా ఉచితంగానే అందజేస్తారని చెప్పారు. త్వరలో మందుల సంఖ్య 105కు పెంచనున్నమన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువులకు కూడా ప్రత్యేక వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో లభిస్తాయని చెప్పారు. డాక్టర్లు వారి పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వచ్చి వైద్య సేవలు అందిస్తారన్నారు. కదలలేని పరిస్థితుల్లో మంచంలో ఉన్న రోగుల ఇళ్లకు వైద్యులు వచ్చి చికిత్స అందిస్తారని తెలిపారు. దీంతో పాటు ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను పూర్తిగా డిజిటలైజ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు వ్యవస్థ ద్వారా ఆరోగ్య వివరాలన్నింటిని పదిల పరుస్తారని వివరించారు. జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి నిలిపిందని చెప్పారు. మంత్రి రజిని స్వయంగా 104 వాహనం నడిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జి.శోభారాణి, మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ రఫాని, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తోట రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

సిద్ధంగా ఉన్న 104 వాహనాలు
1/2

సిద్ధంగా ఉన్న 104 వాహనాలు

104 వాహనాన్ని నడుపుతున్న మంత్రి రజిని
2/2

104 వాహనాన్ని నడుపుతున్న మంత్రి రజిని

Advertisement

తప్పక చదవండి

Advertisement