చిలకలూరిపేట: చారిత్రాత్మక..... | Sakshi
Sakshi News home page

చిలకలూరిపేట: చారిత్రాత్మక.....

Published Sun, Apr 2 2023 1:50 AM

- - Sakshi

చిలకలూరిపేట: చారిత్రాత్మక ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని చిలకలూరిపేట నుంచి ప్రారంభిస్తుండటం తమకు ఎంతో గర్వకారణమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 6వ తేదీన అధికారికంగా ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి విడదల రజిని శనివారం పరిశీలించారు. మంత్రి వెంట వైఎస్సార్‌ సీపీ ప్రోగ్రామ్స్‌ కమిటీ కో–ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఎంఎస్‌ ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ హరీంద్రప్రసాద్‌ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ముందుగా మంత్రి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ముఖ్యమంత్రి సందర్శించనున్న వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ ను పరిశీలించారు. అనంతరం హెలిప్యాడ్‌ ప్రాంతం, సభా ప్రాంగణం, స్టాళ్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను సందర్శించారు. విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సమీపంలోనే సభా ప్రాంగణాన్ని ఖరారు చేశారు. అనంతరం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక రైతు భరోసా కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి..

సమీక్ష సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తారని, ఎవరికీ ఏ ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వాహనాలకు ప్రత్యేక పా ర్కింగ్‌ ప్రాంతాలను గుర్తించాలని చెప్పారు. సభా ప్రాంగణాన్ని చదును చేయాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ లాంటి ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభోత్సవానికి చిలకలూరిపేట వేదిక కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. సీఎం రాక సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన స్టాళ్లకు సంబంధించి ఐసీడీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా భోజన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. చిలకలూరిపేట – నరసరావుపేట రహదారిలో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌, డీఎస్పీ విజయభాస్కర్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement