బలహీనవర్గాల అభ్యున్నతి జగన్‌ ఘనతే | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాల అభ్యున్నతి జగన్‌ ఘనతే

Published Sat, Nov 11 2023 1:42 AM

మాది సామాజిక సిల‘బస్‌’: బస్సు యాత్రలో పాల్గొన్న మోపిదేవి, నందిగం, బీద, పార్థసారథి - Sakshi

అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. శుక్రవారం సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో ధరణికోట జేబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మోపిదేవి మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో కనీసం పదిశాతం కూడా అమలు చేయలేదని, టీడీపీ అధినేత చంద్రబాబు 2014లో అలవికాని అనేక హామీలు గుప్పించి ప్రజలను మోసం చేశారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీల్లో 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతోందని స్పష్టం చేశారు. బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా 2 లక్షల 40వేల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చిన సీఎం వైఎస్‌ జగన్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గౌరవప్రద పదవుల్లో కూర్చోబెట్టిన మహామనిషి జగనన్న అని ప్రశంసించారు. మళ్లీ ఆయనను సీఎం చేసుకోవాల్సిన బాధ్యత బడుగు, బలహీనవర్గాలమైన మనందరిపైనా ఉందని చెప్పారు. సీఎం జగన్‌కు రోజురోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని స్పష్టం చేశారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

● బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి, బీసీలకు పది మంత్రి పదవులిచ్చిన ఘనత జగనన్నదేనన్నారు.

● పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరు శంకరరావు మాట్లాడుతూ జగన్న పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధికి ఇప్పటికే 659 కోట్ల రూపాయలు, సంక్షేమానికి 1,400 కోట్ల రూపాయలు జగనన్న సహకారంతో ఖర్చు చేశామన్నారు. అమరావతి–బెల్లంకొండ డబుల్‌రోడ్డు నిర్మాణ పనులు 149 కోట్ల రూపాయలతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. మాదిపాడు వద్ద 65 కోట్ల రూపాయలతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నామన్నారు.

● ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ జగనన్న పాలనలో పెదకూరపాడు అభివృద్ధి బాటపట్టిందని పేర్కొన్నారు. దీనిలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాత్ర కీలకమని పేర్కొన్నారు.

● వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు పైలా సోమినాయుడు మాట్లాడుతూ జగనన్న పాలనలో సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం దొరికిందన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండెపూడి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు

Advertisement
Advertisement