సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Published Sat, Nov 11 2023 1:42 AM

- - Sakshi

మాచర్ల: వరికపూడిసెల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 15న రానున్న నేపథ్యంలో మాచర్లలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం మూడు జిల్లాల జోనల్‌ ఇన్‌చార్జి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లపై చర్చించారు. అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. తొలుత సాగర్‌ రోడ్డులోని సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో హెలిప్యాడ్‌ను పిన్నెల్లి సోదరులు, అధికారులు పరిశీలించారు. అక్కడి నుంచి 3.5 కిలోమీటర్ల మేర సీఎం కాన్వాయ్‌ పర్యటించే మార్గాన్ని పరిశీలించి బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. మాచర్ల శివారు గుంటూరు రోడ్డులోని చెన్నకేశవ స్వామి కాలనీ ఎదురు 15 ఎకరాలలో వేలాది మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.

అధికారులతో సమీక్ష

అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మాచర్ల మున్సిపల్‌ కార్యాలయంలో జిల్లా అధికారులతో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) సమీక్షించారు. 1.27 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా రూ.1,600 కోట్లతో నిర్మించ తలపెట్టిన వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. పీఆర్కే మాట్లాడుతూ ఈనెల 15న ఉదయం నుంచి సాయంత్రం వరకు సీఎం పర్యటన ఉంటుందన్నారు. 30 వేల మంది నుంచి 50 వేల మంది తరలివచ్చే అవకాశం ఉందని వివరించారు. 550 బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. వసతుల కల్పనపై దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (పీవీ ఆర్‌), జేసీ శ్యామ్‌ప్రసాద్‌, మెప్మా, డ్వాక్రా యాని మేటర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement