హార్బర్‌లో బోటు దగ్ధం | Sakshi
Sakshi News home page

హార్బర్‌లో బోటు దగ్ధం

Published Wed, Nov 15 2023 1:50 AM

 కాలిబూడిద అవుతున్న బోటు - Sakshi

నిజాంపట్నం: నిజాంపట్నం హార్బర్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రూ.60లక్షల విలువైన బోటు దగ్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రోజుల కిందట మత్స్యకారులందరూ వేటను నిలిపివేసి హార్బర్‌లోని జెట్టీలో బోట్లు నిలిపివేశారు. దీపావళి పండుగ ముగియడంతో తిరిగి వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిజాంపట్నంకు చెందిన దండుప్రోలు చెన్నయ్య వేటకు అవసరమైన సామగ్రి, నిత్యావసర వస్తువులు, డీజిల్‌ నింపుకుని వేటకు సిద్ధమయ్యారు. బోటులో నుంచి మంటలు చెలరేగాయి. బోటులో ఉన్న డీజిల్‌ పీపాకు మంటలు వ్యాపించడంతో మంటలు ఎగసిపడ్డాయి. స్థానిక మత్స్యకారులు గమనించి జెట్టీలోని బోట్ల తాడులు ఊడతీసి పక్కకు నెట్టివేశారు. బోటులో పనిచేస్తున్న కళాసీలు వెంకటేశ్వర్లు, కృష్ణలను స్థానిక మత్స్యకారులు తీవ్ర ప్రయత్నం చేసి బయటకు తీసుకువచ్చారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాకు తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగానే ఉందని స్థానికులు తెలిపారు. రేపల్లె అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే బోటు పూర్తిగా దగ్ధమైంది. బోటు యజమాని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. బోటులో మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇద్దరు కళాసీలకు తీవ్ర గాయాలు

సుమారు రూ.60లక్షల ఆస్తి నష్టం

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన హరనాథబాబు

సంఘటనా స్థలాన్ని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సోదరుడు హరనాధబాబు పరిశీలించి బోటు యజమానిని, అగ్నిప్రమాదంలో తీవ్రగాయాలైన ఇద్దరు కళాసీల కుటుంబాలను పరామర్శించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణావు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తారని హామీనిచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వారిలో జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు కన్నా భూశంకర్‌, బోటు ఓనర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు, కన్నా శ్రీనివాసరావు, మోపిదేవి మార్కండేయులు తదితరులున్నారు.

Advertisement
Advertisement