జగనన్న హయాంలో ఆధునికంగా గ్రంథాలయ వ్యవస్థ | Sakshi
Sakshi News home page

జగనన్న హయాంలో ఆధునికంగా గ్రంథాలయ వ్యవస్థ

Published Wed, Nov 22 2023 1:52 AM

మాట్లాడుతున్న మందపాటి శేషగిరిరావు 
 - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: గ్రంథాలయ వ్యవస్థను సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వ ఆధునికంగా తీర్చిదిద్దిందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు పేర్కొన్నారు. అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషగిరిరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు ఒక సజీవ వ్యవస్థగా సమాజంతో మమేకమై ఉన్నాయని, ఈ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక గ్రంథాలయాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రోత్సహిస్తోందని, డిజిటల్‌ గ్రంథాలయాల వ్యవస్థను జగనన్న ప్రభుత్వం గ్రామస్థాయిలో పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామని వివరించారు. వారోత్సవాల్లోనే కాకుండా నిత్య జీవితంలో ప్రతిరోజూ గ్రంథాలయాలకు వచ్చి, విజ్ఞానదాయక పుస్తకాలను చదవడాన్ని అలవాటుగా మలచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల రూపు, రేఖలను మార్చివేసిన ప్రభుత్వం పాఠకులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసిందని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి కుసుమ శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేయాలని సూచించారు. పౌర గ్రంథాలయ శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ షేక్‌ పీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు అందుబాటులో రీడర్స్‌ అన్‌ డిమాండ్‌ ద్వారా అవసరమైన పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ దీక్షితులు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన దేవాలయాలని, గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం చేయటం ద్వారా ఎంతో జ్ఞానాని పెంపొందించుకోవచ్చన్నారు. ఈసందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. కార్యక్రమంలో కన్నా విద్యాసంస్థల డైరెక్టర్‌ కన్నా మాస్టారు, విశ్రాంత వాణిజ్య పన్నుల శాఖాధికారి కె. చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ఝాన్సీలక్ష్మి, గ్రంథ పాలకులు ఎన్‌.నాగిరెడ్డి, ఐవీ దుర్గారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement