అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంది | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంది

Published Tue, Dec 5 2023 5:20 AM

-

గుంటూరు ఎడ్యుకేషన్‌: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలు అధైర్యపడొద్దని, అండగా నిలిచి అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. తుఫాన్‌ దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలపై ఆమె సోమవారం జెడ్పీ క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న గ్రామాల్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్‌ కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారని, అత్యవసర ఖర్చుల కోసం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు లేనివిధంగా కేవలం ఆంధ్రప్రదేశ్‌కే ఉన్న అతిపెద్ద సైన్యమైన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తుఫాన్‌ కారణంగా గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్నా సమీపంలోని గ్రామ సచివాలయంతో పాటు వలంటీర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం లేని వారితోపాటు షెల్టర్లకు వెళ్లిన ఒక్కో కుటుంబానికి గతంలో మాదిరిగా రూ.2,500 ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు. అదేవిధంగా ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్‌పామ్‌, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున అందించే ఏర్పాట్లు చేశారని వివరించారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా తుఫాన్‌ నేపథ్యంలో అధికారులతో సమీక్ష

Advertisement
Advertisement