సిద్ధం సభకు పటిష్ట బందోబస్తు | Sakshi
Sakshi News home page

సిద్ధం సభకు పటిష్ట బందోబస్తు

Published Sat, Mar 9 2024 9:50 AM

పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న గుంటూరు రేంజి ఐజీ జీ.పాలరాజు - Sakshi

మేదరమెట్ల: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పీ.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఆదివారం నిర్వహించనున్న సిద్ధం సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రేంజి ఐజీ పాలరాజు, అడ్మిన్‌ ఐజీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మేదరమెట్లలో శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా పోలీసు అధికారులు తీసుకుంటున్న బందోబస్తు గురించి ఎస్పీ వివరించారు.

సిద్ధం సభకు మొత్తం 10 లక్షలకు పైగా ప్రజలు హాజరవుతారని, సభకు వచ్చే వాహనాలు పార్కింగ్‌ చేసుకునేందుకు, సభ నిర్వహణకు మొత్తం 338 ఎకరాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సభ సజావుగా జరిగేందుకు ప్రతి పోలీసు అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఐజీ మాట్లాడుతూ సిద్ధం సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతున్న సందర్భంగా వాహనాలను దారి మళ్లింపు విషయంలో ప్రజలకు అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కమ్యూనికేషన్‌ సెట్‌ల ద్వారా ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు.

సభకు వచ్చే వాహనాలు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా వాహనాలను వరుస క్రమంలో పార్కింగ్‌ చేయించాల్సిన బాధ్యత కూడా పోలీసులపై ఉందన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ, ప్రకాశం జిల్లా ఎస్పీ పీ.పరమేశ్వరరెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్‌ కే.తిరుమలేశ్వరరెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement