టీడీపీ డీలా | Sakshi
Sakshi News home page

టీడీపీ డీలా

Published Wed, Apr 10 2024 1:35 AM

- - Sakshi

అధికార పార్టీతో పోటీపడలేం

బీజేపీతో పొత్తు పుట్టిముంచింది

వలంటీర్లను తప్పించడం దెబ్బకొట్టింది

పింఛన్‌ దారులతోపాటు ప్రజల్లో వ్యతిరేకత

సంక్షే పథకాల ఓట్లు వైఎస్‌ జగన్‌కే

అధికార పార్టీ వైపే మహిళలు

టీడీపీ నేతల్లో అంతర్మథనం

సాక్షి ప్రతినిధి, బాపట్ల: టీడీపీ చతికిలపడుతోంది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి అభ్యర్థులు కదనరంగంలో రాలేకపోతున్నాయి. అందుకు కారణం ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. అన్నివర్గాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. ఇది జీర్ణించుకోలేని కూటమి పార్టీలు ప్రభుత్వ పథకాలు ఇంటివద్దకు చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై పగబట్టాయి. వారిని నిలిపి వేయాలని ఎన్నికల కమిషన్‌కు పదేపదే ఫిర్యాదులు చేశాయి.

దీంతో ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు ముగిసే వరకు వలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను ఇంటి వద్దకు చేరుస్తున్న వలంటీర్లను అడ్డుకోవటంతో పచ్చ పార్టీతో పాటు కూటమి పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి తోడు టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ జతకట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఈ ఎన్నికల్లో ప్రతిఫలించనుంది. ప్రజల్లో కూటమిపై వ్యతిరేకత, ఓటర్ల నుంచి సానుకూలత లోపించటంతో కూటమి అభ్యర్థులు మరింతగా డీలా పడిపోయారు.

బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రేపల్లె, అద్దంకి, పర్చూరు, చీరాలతో సహా నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అధికార పార్టీకి మద్దతు పలికారు. ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించటంతో ప్రజల్లో రెట్టింపు సానుకూలత ఉంది. పైగా జనసేన, బీజేపీతో కలిసి కూటమి కట్టిన పచ్చపార్టీ జిల్లాలో అటు జనసేనకు గానీ, ఇటు బీజేపీకి గానీ ఒక్కసీటు కేటాయించలేదు.

బాపట్ల సీటు కోసం బీజేపీ ప్రయత్నించింది. చీరాల సీటు తమకు ఇవ్వాలని జనసేన గట్టిగానే కోరింది. కానీ టీడీపీ బాపట్ల జిల్లాలో ఒక్కసీటు కూడా ఆ రెండు పార్టీలకు కేటాయించలేదు. దీంతో జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పచ్చపార్టీపై కొంత ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా జనసేనకు అండగా ఉన్న కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఎన్నికల్లో వారు టీడీపీ అభ్యర్థులకు సహకరించే పరిస్థితులు కనిపించటం లేదు. కూటమి పార్టీల నుంచే సహకారం అందక పోవటంతో పచ్చపార్టీ అభ్యర్థులు దిక్కుతోచని ిస్థితిలో పడ్డారు.

అధికారపార్టీపై సానుకూలత...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. రైతులు, మహిళలు, కార్మికులు మొదలు అన్నివర్గాల పేదల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, సున్నా వడ్డీ, చేయూత, పింఛన్లు, డ్వాక్రా రుణాలు, ఇంటి స్థలాలు, పక్కాగృహాలు, రైతుభరోసా, ఉచిత పంటల బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, యంత్ర పరికరాలు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పొలం వద్దే పంటల కొనుగోలు చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యస్థాపనకు నడుంబిగించింది.

నాడు– నేడు ద్వారా కునరిల్లుతున్న పాఠశాలకు మహర్దశ కల్పించింది. అదే విధంగా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేశారు. నవరత్నాలు ద్వారా అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించి పేదల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. వలంటీర్ల ద్వారా ఇంటివద్దకే అన్ని పథకాలు అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం అన్ని పథకాల్లోనూ ప్రాధాన్యం కల్పించింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు రాబోయే ఎన్నికల్లోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు సన్నద్ధమయ్యారు.

చంద్రబాబు హామీలపై ఈసడింపు..
చంద్రబాబు గత పాలనను చూసిన ప్రజలు ఎన్నిరకాల ఉచితాలు ప్రకటించినా ఆయనను నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో ప్రతిపక్ష కూటమికి ఇప్పటికే దూరమయిన ఓటర్లు రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పసిగట్టిన పచ్చపార్టీ అభ్యర్థులు ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కోవటం సాధ్యం కాదని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం, అందరూ కలిసి వలంటీర్లను ప్రజలకు దూరం చేయడం తదితర కారణాలు రాబోయే ఎన్నికల్లో మరింత నష్టం చేయనుందని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలే పేర్కొంటుండటం గమనార్హం.

Advertisement
Advertisement