అర్ధాకలి చదువులు | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:56 AM

ఇళ్ల దగ్గరి నుంచి తెచ్చుకున్న భోజనం తింటున్న విద్యార్థులు - Sakshi

బూర్గంపాడు: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇళ్ల దగ్గరి నుంచి కొందరు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తెచ్చుకుంటుంటే, మరికొందరు లంచ్‌ బాక్స్‌లు లేకుండానే కాలేజీలకు వస్తున్నారు. భోజనం తెచ్చుకోని వారిలో కొందరు కడుపు మాడ్చుకుంటుండగా, మరికొందరు తోటి విద్యార్థులు తెచ్చుకున్న దాంట్లో భాగం పంచుకుంటున్నారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఈ పథకం అమలుకు రెండేళ్లుగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారే తప్ప అమలు కావడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలల్లో ఉండే విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకపోవటంతో నీరసించిపోతున్నారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమస్యగా మారింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే వారిలో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందినవారే. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరాలి. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రులు వీరికి లంచ్‌బాక్స్‌ కట్టి ఇవ్వటం కొంత ఇబ్బందికరంగానే మారింది. ఒకరోజు లంచ్‌ బాక్స్‌ ఇస్తే, రెండురోజులు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. లంచ్‌బాక్స్‌ సిద్ధం చేసేందుకు సమయం లేకపోవటం, కొందరికి ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ఉదయాన్నే ఇంటి వద్ద భోజనం చేసి లంచ్‌ బాక్స్‌లు లేకుండానే కళాశాలలకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్ధాకలితో చదువులను కొనసాగిస్తున్నారు. కొందరు మంచినీళ్లతోనే కడుపు నింపుకుంటున్నారు.

కొంతమంది మిత్రులు తెచ్చిన భోజనాన్ని పంచుకుంటుండగా, అది ఇద్దరికీ సరిపోవడం లేదు. కౌమార దశలో ఉన్న విద్యార్థులు కడుపునిండా తినకపోవటంతో అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగింది. విద్యార్థులు పగలంతా కళాశాలలో ఉండాలంటే ఒంట్లో సత్తువ ఉండాలి. అందుకు సరిపడా ఆహారం తీసుకోవాలి. ప్రాక్టికల్స్‌, ప్రీ ఫైనల్‌ పరీక్షలపై దృష్టి పెట్టాల్సిన సమయమిది. ఈ తరుణంలో అయినా విద్యార్థులకు కనీసం స్నాక్స్‌ అందిస్తే కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు : 14

ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు : 2,991

ద్వితీయ సంవత్సర విద్యార్థుల సంఖ్య : 2,622

ఇబ్బందులున్న మాట నిజమే

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాక ఇబ్బందులున్న మాట నిజమే. కొందరు విద్యార్థులు ఇంటి నుంచి లంచ్‌బాక్స్‌లు తెచ్చుకోవటం లేదు. మధ్యాహ్న భోజనం లేకపోవటంతో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా రెసిడెన్షియల్‌ కాలేజీల వెపే మొగ్గుచూపుతున్నారు.

– సులోచనరాణి, డీఐఈఓ

లంచ్‌ బాక్స్‌ కోసం ఉంటే ఆలస్యమవుతుంది

కళాశాలకు సకాలంలో వెళ్లాలంటే ఉదయం 8.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాలి. ఆ సమయానికి రోజూ లంచ్‌బాక్స్‌ తయారు కాదు. అప్పటికే ఇంట్లో ఏది ఉంటే అది తిని హడావుడిగా బయలుదేరుతున్నాం. లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోని రోజు మధ్యాహ్నం బాగా ఆకలేస్తుంది. నీళ్లు తాగి సాయంత్రం వరకు ఆలాగే ఉంటాం.

– అక్షయ్‌కుమార్‌, సారపాక

ఆర్థిక ఇబ్బందులతో బాక్స్‌ తేవడం లేదు
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోవటం లేదు. ఉదయాన్నే ఇంటి దగ్గర తినివస్తా. మళ్లీ సాయంత్రం ఇంటికి వెళితేనే తినేది. ఫ్రెండ్స్‌ తినమంటారు. కానీ నాకు ఆకలిగా లేదని చెబుతా. కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే బాగుంటుంది.

– శెనగ లహరి, వెలేరు

Advertisement

తప్పక చదవండి

Advertisement