ఐదుగురికి ఏడాది జైలుశిక్ష | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 25 2023 8:56 AM

- - Sakshi

కొత్తగూడెంటౌన్‌: చేతబడి చేశారనే నెపంతో ములకలపల్లికి చెందిన కేసరి రామచంద్రంపై దాడి చేసి కొట్టిన ఐదుగురు వ్యక్తులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బత్తుల రామారావు శుక్రవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. ములకలపల్లి మండలం ముగురాళ్లగొప్ప గ్రామానికి చెందిన గుండె రమేష్‌ కూతురు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తిప్పాడు. 2017, జూలై 5న చికిత్స కోసం సత్తుపల్లికి వెళ్లొస్తుండగా మృతి చెందింది. దీంతో అదే గ్రామానికి చెందిన కేసరి రామచంద్రం చేతబడి చేయడంతోనే తన కూతురు మృతి చెందిదంటూ అదే రోజు రాత్రి రమేష్‌ దాడికి దిగాడు. రమేష్‌తోపాటు గుండె నాగరాజు, గుండె వెంకటేష్‌, గుండె రాజేష్‌, గుండు శ్రీను, గుండి భద్రయ్య మూకుమ్మడిగా వచ్చి కర్రలు, గొడ్డలితో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో రామచంద్రం దంతాలు ఊడిపోయాయి.

ఈ ఘటనపై గ్రామానికి చెందిన కేసరి శ్రీను 2017, జూలై 6న ములకలపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో గుండి భద్రయ్య మృతి చెందాడు. ఆరుగురు సాక్షుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మిగిలిన ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. 143,147,148 సెక్షన్ల కింద నెల చొప్పున, 324 సెక్షన్‌ కింద సంవత్సరం, 342, ఆర్‌/డబ్ల్యూ, 149/ఐపీసీ సెక్షన్‌ కింద ఆరు నెలల చొప్పున శిక్షతోపాటు రూ.1300 జరిమానా విధించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ ఏ.రాజారాం వాదించగా, నిర్వహించగా వీరబాబు, హరిగోపాల్‌, కోర్టు పీసీ బిక్కులాల్‌ సహకరించారు.

Advertisement
Advertisement