కుక్కకాట్లపై అప్రమత్తంగా ఉండండి | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 26 2023 12:50 AM

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌, విజేత   - Sakshi

●రక్షణ చర్యలు చేపట్టండి.. ●కలెక్టర్‌ అనుదీప్‌
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజలు కుక్కకాటుకు గురికాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ మున్సిపల్‌, పంచాయతీ అధికారులను ఆదేశించారు. కుక్కలవృద్ధి రేటును నియంత్రించే ఆపరేషన్లు, అత్యవసర వైద్యసేవలు.. తదితర అంశాలపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కుక్కల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తక్షణ చర్యలు చేపట్టి ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. సోమవారం నుంచి ఆపరేషన్లు ప్రారంభించాలని, పర్యవేక్షణకు కుటుంబ నియంత్రణ కేంద్రంలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. రోజుకు వంద కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో మాంసపు దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలను బయట వేయకుండా అవగాహన చర్యలు చేపట్టాలని సూచించారు. ఫంక్షన్‌హాళ్లు, కోళ్ల వ్యర్థాలు మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సిబ్బదికి అప్పగించాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క, కోతి కాటు మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో డీపీఓ రమాకాంత్‌, వైద్యాధికారులు ముక్కంటేశ్వరరావు, రామకృష్ణ, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపల్‌ కమిషనర్లు రఘు, శ్రీకాంత్‌, అంకుషావలి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

28న జాబ్‌మేళా

జిల్లా ఉపాధి, శిక్షణశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28న కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో జాబ్‌మేళాకు సంబంధించి ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబ్‌మేళా 28న ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 8వ తరగతి నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్‌ ఎంబీఏ, ఎంసీఏ, ఐటీఐల్లోని వివిధ ట్రేడ్‌లు, డిప్లొమా తదితర అర్హతలు ఉన్నవారు తమ బయోడేటాతో పాటు విద్యార్హత జిరాక్స్‌ పత్రాలతో హాజరు కావాలని చెప్పారు. కార్యక్రమంలో వేల్పుల విజేత పాల్గొన్నారు.

Advertisement
Advertisement