గాడి తప్పుతున్న బడి.. | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2023 9:50 PM

జిల్లా విద్యాశాఖ కార్యాలయం  - Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా విద్యాశాఖలో పాలన గాడి తప్పుతోంది. జిల్లాకు రెగ్యులర్‌ డీఈఓ లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం ఇన్‌చార్జ్‌ డీఈఓగా ఉన్న సోమశేఖర శర్మ భద్రాద్రి జిల్లాకు కూడా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ శాఖలో చేపట్టాల్సిన పనుల్లో జాప్యం జరుగుతోంది. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ జనవరిలో ప్రారంభమైంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మోడల్‌ స్కూల్స్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌.ప్రసాద్‌ను జిల్లాకు డీఈఓగా నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ ఎ.దేవసేన జనవరి 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడి డీఈఓ సోమశేఖర శర్మను ఖమ్మం బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు నిలిచిపోవడంతో ప్రసాద్‌ను తిరిగి యథాస్థానానికి పంపించారు. తిరిగి సోమశేఖరశర్మను ఇన్‌చార్జ్‌ డీఈఓగా నియమించారు. అయితే ఆయన అసలు పోస్టు డైట్‌ లెక్చరర్‌ కాగా, రెండు జిల్లాలకు ఇన్‌చార్జ్‌ డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల పర్యవేక్షణ భారంగా మారుతోంది. వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యాశాఖకు ఇది కీలక సమయం. ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తూ పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పనిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ పనులన్నీ రెండు జిల్లాల్లో ఒకే సమయంలో చేయడం అంత సులభం కాదు. దీంతో విద్యాశాఖలో పాలన గాడి తప్పే పరిస్థితి నెలకొందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కీలక పోస్టులన్నీ ఖాళీ..

జిల్లా విద్యాశాఖలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన పోస్టు అయిన డీఈఓ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఉండాల్సిన ఏడీ పోస్టూ ఖాళీగానే ఉంది. ఇక 23 మండలాలకు ఎక్కడా రెగ్యులర్‌ ఎంఈఓలు లేరు. 11 మంది హెచ్‌ఎంలే 23 మండలాలకు ఇన్‌చార్జ్‌ ఎంఈఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కొందరు రెండు, మూడు మండలాల బాధ్యతలు సైతం చూడాల్సి వస్తోంది. దీంతో అటు మండలాలకు, ఇటు సొంత పాఠశాలకు సరైన న్యాయం చేయలేకపోతున్నారు. విద్యాశాఖకు సంబంధించి ఏవైనా మార్గదర్శకాలు, ప్రభుత్వ పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాల వంటివి ముందుకు తీసుకెళ్లడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.

కానరాని పర్యవేక్షణ..

విద్యాశాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు స్పెషల్‌ క్లాసుల్లో అందించే అల్పాహారంపైనా పర్యవేక్షణ కొరవడుతోంది. దీనిపై అధికారులు తని ఖీలు చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులకు అల్పాహారం పూర్తి స్థాయిలో అందుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలని, పాలన గాడిలో పెట్టేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లా విద్యాశాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన..

రెండు జిల్లాలకూ ఒకరే డీఈఓ

11 మంది ఎంఈఓలూ ఇన్‌చార్జ్‌లే..

పరీక్షల వేళ.. కొరవడుతున్న

పర్యవేక్షణ

Advertisement
Advertisement