నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

Published Wed, Aug 23 2023 12:16 AM

- - Sakshi

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నర్సింహాలయంలో సుదర్శన హోమం..

రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయంలో సుదర్శన హోమం, ప్రత్యేక పూజలు చేశారు. రామాలయంలో ఈనెల 26 నుంచి 31 వరకు పవిత్రోత్సవాలు, 25న శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

డీఎంహెచ్‌ఓ శిరీష

బూర్గంపాడు: సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శిరీష సూచించారు. మండల పరిధిలోని కృష్ణసాగర్‌, లక్ష్మీపురం, ఇరవెండి, సోంపల్లి, బూర్గంపాడు గ్రామాల్లో నిర్వహిస్తున్న లెప్రసీ సర్వేను మంగళవారం ఆమె పరిశీలించారు. జ్వరపీడితుల వివరాలు, జ్వరాల తీవ్రత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దోమల నివారణకు నీటి నిల్వ ప్రాంతాల్లో గంబూషీయా చేపలు వదిలే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం మోరంపల్లిబంజర పీహెచ్‌సీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ లక్ష్మీసాహితి, వైద్యసిబ్బంది జీతు, బి.రవి, సత్యవతి, సడాల దేవి, రమణమూర్తి పాల్గొన్నారు.

పీజీ సెట్‌లో జిల్లా విద్యార్థికి ప్రథమ ర్యాంక్‌

టేకులపల్లి: పీజీ సెట్‌ తెలుగు విభాగంలో టేకులపల్లి మండలం పాతర్లగడ్డ గ్రామానికి చెందిన మేకల అశోక్‌ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. మారుమూల ఏజెన్సీ గ్రామానికి చెందిన ఆదివాసీలు మేకల సంగయ్య – బొజ్జమ్మ దంపతుల కుమారుడు అశోక్‌ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. బీఈడీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతూ పీజీ సెట్‌ రాశాడు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన అశోక్‌ను పలువురు అభినందించారు.

రిజిస్ట్రేషన్‌ శాఖలో బదిలీలు

అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌గా రవీంద్రబాబు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎన్నో ఏళ్లుగా స్థానచలనం లేకుండా ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖలోని సబ్‌ రిజిస్ట్రార్ల బదిలీలు ఎట్టకేలకు జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు సబ్‌ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–1 అడపా రవీంద్రబాబును జిల్లా అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్‌ చిట్‌ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తున్న గంగవరపు నరేంద్రను ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. అలాగే, ఖమ్మం ఎంవీ అండ్‌ ఆడిట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.పద్మను ఖమ్మం జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–1గా, ఖమ్మంరూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ టి.సుజన్‌కుమార్‌ను ఎంవీ అండ్‌ ఆడిట్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అలాగే, మధిర సబ్‌ రిజిస్ట్రార్‌ ఎస్‌.రామకిషోర్‌రెడ్డిని నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌గా, భద్రాచలం సబ్‌రిజిస్ట్రార్‌ ఏ.గిరిధర్‌ను మధిర సబ్‌ రిజిస్ట్రార్‌గా బదిలీ చేశారు. అయితే, భద్రాచలం సబ్‌ రిజిస్ట్రార్‌గా మాత్రం ఎవరినీ నియమించలేదు.

లక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు
1/2

లక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు

మేకల అశోక్‌
2/2

మేకల అశోక్‌

Advertisement
Advertisement