ఏవండీ.. ఇంటికి త్వరగా వెళ్లండి.. | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ బందోబస్తుకు భద్రాచలం వెళ్లి అనంతలోకాలకు..

Published Sun, Oct 1 2023 12:50 AM

- - Sakshi

కొత్తగూడెంటౌన్‌: ‘ఏవండీ ఇంటికి త్వరగా వెళ్లండి. త్వరగా భోజనం చేయండి. నేను కేటీఆర్‌ పర్యటన పూర్తికాగానే సాయంత్రం తొందరగా ఇంటికి వస్తాను’ అని చెప్పి వెళ్లిన శ్రీదేవి తిరిగిరాలేదంటూ భర్త రామారావు గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి తిరిగి వస్తుందనుకున్న అమ్మ ఇక రాకపోవడంతో కూతురు, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధులకు వెళ్లి ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి మహిళా హెడ్‌కానిస్టేబుల్‌ పల్లపు శ్రీదేవి(49) మృతి చెందింది.

1995లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆమె జిల్లాలోని వివిధ ఠాణాల్లో పనిచేసింది. హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందింది. ఇటీవల వరకు పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేయగా, 15 రోజుల క్రితమే కొత్తగూడెం వన్‌టౌన్‌లో విధుల్లో చేరింది. ఆమె భర్త రామారావు కూడా ఎస్‌బీ విభాగంలో కొత్తగూడెంలోనే కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం మంత్రి కేటీఆర్‌ భద్రాచలం పర్యటన ఉన్న నేపథ్యంలో ఆమెకు బందోబస్తు విధులు కేటాయించారు. ఉదయం ఇంటి నుంచి బయల్దేరేటప్పుడు సమాయానికి భోజనం చేయడంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్లింది. మంత్రి పర్యటన రద్దుకాగా ఆమె శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకుని, అన్నదాన సత్రంలో భోజనం చేసి వస్తోంది.

అప్పటికే భారీ వర్షం కురవగా డ్రెయిన్లు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాన కాస్త తెరపి ఇవ్వగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ వస్తున్న ఆమె మురుగు కాల్వలో పడి కొట్టుకుపోయింది. అనంతరం పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా ఇద్దరికీ వివాహాలు చేశారు. మృతదేహాన్ని న్యూగొల్లగూడెంలో ఇంటికి తీసుకురాగా, ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.

వన్‌టౌన్‌ సీఐ కరుణాకర్‌, ఎస్సై విజయ, ఇతర సిబ్బంది మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కలివిడిగా ఉండే శ్రీదేవి మృతి చెందడంతో తోటి సిబ్బంది, స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. శ్రీదేవి భర్త రామారావుది నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి కావడంతో ఆ గ్రామంలో కూడా విషాదం నెలకొంది. కాగా శ్రీదేవి మృతిపట్ల నిర్భయ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఉమెన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు, మహిళా న్యాయవాది మల్లెల ఉషారాణి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.

రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
భద్రాచలం: మంత్రి కేటీఆర్‌ పర్యటన బందోబస్తుకు భద్రాచలం వచ్చి ప్రమాదవశాత్తు మరణించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీదేవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన శ్రీదేవి మరణించిన డ్రెయినేజీలు, స్లూయీస్‌ల ప్రాంతాన్ని పరిశీలించారు.

రామాలయం చుట్టపక్కల స్లూయీస్‌లు, డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదని అన్నారు. ఉద్యోగి మృతి బాధాకరమని, ప్రభుత్వ అలసత్వమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. భద్రాచలం అభివృద్ధికి హామీ ఇచ్చి అమలు చేయని కేసీఆర్‌, కేటీఆర్‌ పర్యటనకు వాతావరణంతో పాటు భద్రాద్రి రామయ్య సైతం సహకరించలేదని, ఇప్పటికై నా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement