అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదు

Published Tue, Oct 3 2023 12:08 AM

వంశీ (ఫైల్‌) - Sakshi

ఇల్లెందురూరల్‌: బీఆర్‌ఎస్‌ నాయకులు కొందరు తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అదే పార్టీకి చెందిన అసమ్మతి నాయకుడు వాంకుడోత్‌ శ్రీనివాస్‌ సోమవారం కొమరారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో అభివృద్ధిపై తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పే క్రమంలో తీవ్రస్థాయిలో చేసిన దూషణలు తనను మానసికంగా ఇబ్బందికి గురిచేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్సై గిరిధర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఫిర్యాదు అందిందని, విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐదుగురిపై కేసు నమోదు

పాల్వంచరూరల్‌: పెద్దమ్మగుడి సమీపంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ కార్తీక్‌ కథనం ప్రకారం.. పెద్దమ్మగుడి వద్ద విజయదుర్గ కేటరింగ్‌ సప్లయిర్స్‌గా పనిచేస్తున్న జగన్నాథపురం గ్రామానికి చెందిన ధర్మసోత్తు వంశీ, నరేష్‌, సాయి, శ్రీను, మహేందర్‌ కర్రలతో ఫంక్షన్‌హాల్‌ అద్దాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఫంక్షన్‌హాల్‌ యజమాని నరేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

గుండాల: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆళ్లపల్లి మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన కుంజా నరేష్‌(30) నాలుగు రోజుల క్రితం కాచనపల్లి వెళుతుండగా కాచనపల్లి–అనంతోగు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఖమ్మం తరలించగా, చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, కుమారడు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య

సుజాతనగర్‌: పురుగుల మందు తాగిన యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మండలంలోని సీతంపేట బంజర గ్రామానికి చెందిన గుగులోత్‌ రమేష్‌, నీలా దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు వంశీ(23) మైనింగ్‌ డిప్లొమా పూర్తి చేశాడు. పోలీస్‌ ఉద్యోగ పోటీ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. పరీక్ష అనంతరం కీ పేపర్‌ చెక్‌ చేసుకుని, తనకు 105 మార్కులు వస్తాయని, ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటూ ఇటీవలే తల్లిదండ్రులతో ఆనందం పంచుకున్నాడు. కాగా గత నెల 30న ఉన్నత చదువుల కోసం కొంత డబ్బు అడుగగ, వ్యవసాయ పెట్టుబడుల కారణంగా ఇప్పుడు ఇవ్వలేమని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో మనస్తాపం చెంది అదే రోజు పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఖమ్మం తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడు. ఉద్యోగం వచ్చే తరుణంలో కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా మృతుడి కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు.

Advertisement
Advertisement