సమస్యల సుడిగుండం.. | Sakshi
Sakshi News home page

సమస్యల సుడిగుండం..

Published Wed, Nov 15 2023 12:24 AM

గోదావరిలో కలుస్తున్న బీటీపీఎస్‌ నుంచి వెలువడే వ్యర్ధాలు - Sakshi

●బీటీపీఎస్‌, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం ●ఆగమవుతున్న స్థానికుల బతుకులు ●వ్యాధులతో అవస్థ, సమస్యలతో సతమతం ●అంతంత మాత్రంగానే ఉపాధి అవకాశాలు

ఉపాధి కల్పన నామమాత్రమే

బీటీపీఎస్‌లో డిగ్రీ నుంచి పీజీ చదివిన వారితో పాటు నిరక్షరాస్యులకూ రూ.300 నుంచి రూ.350 మించి రోజువారీ వేతనం ఇవ్వకపోవడంతో వెట్టి చాకిరీకి ప్రతిరూపంగా మారినట్లయింది. సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా స్థానికేతరులకే అవకాశం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీటీపీఎస్‌ భూనిర్వాసితులకు కొందరికి జెన్కో శాశ్వత ఉపాధి కల్పించగా, ఆయా పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారు మౌలిక సదుపాయాలపై ప్రశ్నించినా ఫలితం ఉండటం లేదు. సింగరేణి ఓబీ కంపెనీలతో పాటు ఇతర ప్రైవేట్‌ కంపెనీల్లో 70 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని ఉన్నా అవేవి అమలు కావడం లేదని పగిడేరు, గాంధీనగర్‌, బుగ్గ, రాజుపేట, సాంబాయిగూడెం మణుగూరు యువకులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

మణుగూరుటౌన్‌: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రభావిత ప్రాంత ప్రజలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తమ గ్రామం అభివృద్ధి బాట పడుతుందని, జీవితాలు బాగుపడతాయని ఆశిస్తే చివరికి నిరాశే ఎదురవడం వారి ఆవేదనకు కారణమవుతోంది. పారిశ్రామిక సంస్థలు ప్రారంభ సమయంలో ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా నెరవేరలేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి గనులు కాలుష్యపు కోరలు చాచగా, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ బొగ్గు తరలింపుతో వస్తున్న కాలుష్యం, పైపు లీకేజీలతో గరళంగా మారుతున్న గోదావరి, నిత్య ప్రమాదాలతో గాలిలో దీపాలుగా మారిన ప్రజల ప్రాణాలు, పట్టింపులేని పాలకుల తీరుతో నిత్యనరకం అనుభవిస్తున్నారు.

బతుకు జీవుడా..

ప్రభావిత ప్రాంతాల ప్రజలు సమస్యలతో సహవా సం చేస్తూ రోగాలతో అవస్థలు పడుతూ ఆర్థిక నష్టానికి గురవుతూ బతుకుజీవుడా అంటూ జీవిస్తున్నారు. అభివృద్ధి పేరిట తీసుకున్న స్థలాల్లో వెలిసిన సంస్థలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు. బీటీపీఎస్‌, సింగరేణి వల్ల వస్తున్న కాలుష్యం, లీకేజీ, బొగ్గు లారీల ప్రమాదాలతో, శ్వాసకోస వ్యాధులతో నిత్యం సతమతమవుతున్నారు. ‘దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్న చందంగా వారి దుస్థితి మారింది. సింగరేణి ప్రభావిత గ్రామాలైన విప్పల సింగారం, పగిడేరు, మణుగూరు, రాజుపేట, గాంధీనగర్‌, బీటీపీఎస్‌ ప్రభావిత ప్రాంతాలైన దమ్మక్కపేట, సాంబాయిగూడెం, రామానుజవరం గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలూ అందుబాటులోకి రాలేదు. సింగరేణిలో ప్రతిరోజు జరిగే బ్లాస్టింగ్‌లతో గాంధీనగర్‌, రాజుపేట, పగిడేరు గ్రామాల్లోని నివాసాలు బీటలు వారుతున్నాయి. బ్లాస్టింగ్‌కు లేచిన దుమ్ము, ధూళి ఇంటిలోని తాగునీటిపై చేరుతోంది. ఆ నీళ్లను తాగిన ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మణుగూరు ఓసీ నుంచి సింగరేణికి.. సింగరేణి నుంచి బీటీపీఎస్‌కు బొగ్గు తరలిస్తున్న క్రమంలో లారీల వేగానికి వందల జీవాలు, ప్రజల ప్రాణాలు కోల్పోగా, వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బీటీపీఎస్‌ యాష్‌పాండ్‌ లీకేజీతో గోదావరిలో బూడిద కలిసి కలుషితమవుతున్నాయి. వెలువడుతున్న వ్యర్థ పదార్థాలు దమ్మక్కపేట, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం నివాసాలపై పడటం.. ఆ గాలిని పీల్చి శ్వాస కోశ వ్యాధులతో పాటు చర్మ సంబంధిత రోగాలు, జ్వరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులను తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినప్పటికీ హెల్త్‌ క్యాంపు నిర్వహించకపోవడం గమనార్హం.

1/1

Advertisement
Advertisement