మళ్లీ తెరపైకి ‘అవిశ్వాసం’ | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి ‘అవిశ్వాసం’

Published Wed, Nov 15 2023 12:24 AM

ఇల్లెందు మున్సిపల్‌ కార్యాలయం - Sakshi

●కౌన్సిలర్ల సంతకాల సేకరణ ●ససేమిరా అన్న కొందరు ●సోషల్‌ మీడియాలో చైర్మన్‌, కౌన్సిలర్ల ఫోన్‌ సంభాషణ

ఇల్లెందు: అజెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్‌ పాలక వర్గానికి గండం ఎదురైంది. నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు (డీవీ)ను అవిశ్వాసం పెట్టి దించాలని యుద్ధం జరగగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో అవిశ్వాసం అంశం తెరమీదకు వచ్చింది. అప్పుడే సంతకాల సేకరణ కూడా షురూ అయ్యింది. కొంత మంది కౌన్సిలర్‌లు ససేమిరా అంటే వారికి ‘పైకం’ ముట్టజెప్పి సంతకాలు చేయించినట్లు తెలిసింది. సోమవారం రాత్రి పట్టణంలోని లలిత కళామందిర్‌రోడ్‌లో ఓ ప్రజాప్రతినిధి ఇంటి వద్ద జరిగిన సమావేశంలో సంతకాల సేకరణ జరిగినట్లు సమాచారం. గతంలో కొందరు కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లగా అప్పుడు దూరంగా ఉన్న కౌన్సిలర్లను కూడా ఆహ్వానించి వారి నుంచి సంతకాలు సేకరించారు. అయితే ఎన్డీ, సీపీఐలకు చెందిన ఇద్దరు డీవీ వెంట ఉన్న ముగ్గురు, ముందే కాంగ్రెస్‌లో చేరిన మరో కౌన్సిలర్‌ తప్ప అంతా సంతకాల సేకరణకు తలొగ్గారు. దీంతో అవిశ్వాసం కోసం ఇప్పటికే అందరికీ రూ.2 లక్షలు అందాయి. రానున్న జనవరిలో కౌన్సిల్‌కు నాలుగు ఏళ్లు నిండుతాయి. అవిశ్వాసం ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందని ముందస్తుగా ఈ ప్రక్రియకు బీజం వేశారు. ఇటీవల మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతోపాటు ముగ్గురు కౌన్సిలర్‌లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరినందున అవిశ్వాసం ప్రకటించి దించి వేయాలని ఇటీవల అధికార పార్టీ కౌన్సిలర్ల సమావేశంలో నిర్ణయించారు.

ససేమిరా అన్న ఇద్దరు..

సంతకాల సేకరణ సమయంలో ఇద్దరు కౌన్సిలర్‌లు అంగీకారం తెలుపకపోవటంతో కొంతసేపు హైరానా చోటు చేసుకుంది. చైర్మన్‌ను దించేందుకు వారు అంగీకరించలేదు. అయితే చైర్మన్‌ వెంటే వెళ్లాలని, పార్టీలో ఉండాలనుకుంటే పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుని అవిశ్వాసానికి అంగీకారం తెలపాలని ఒత్తిడి చేయటం, రూ.2 లక్షలు పైకం కావాలంటే సంతకం పెట్టాలని హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక వారు రూ.2 లక్షలు తీసుకున్నారు.

ఫోన్‌ సంభాషణ కలకలం..

మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు.. 21వ వార్డు కౌన్సిలర్‌ కొండపల్లి సరిత భర్త గణేశ్‌ ఫోన్‌ సంభాషణ వాట్సాప్‌ గ్రూపుల్లో చెక్కర్లు కొట్టింది. చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావును పదవీచ్యుతుడిని చేసేందుకు ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్‌నాయక్‌ పన్నిన ‘వ్యూహం’ వారి సంభాషణలో బట్టబయలైంది. ఈ సంభాషణకు సంబంధించిన మూడు భాగాల ఆడియో టేపులు వాట్సాప్‌ గ్రూపుల్లోకి రావడంతో కలకలం రేపింది. ఇదిలాఉండగా చైర్మన్‌ డీవీ.. ఉద్యమకారుడు ఎర్రబెల్లి కిష్టయ్య మధ్య రెండు నెలల కిందట జరిగిన ఫోన్‌ సంభాషణను బీఆర్‌ఎస్‌ వర్గీయులు వదిలారు. ఇలా రోజంతా వాట్సాన్‌ గ్రూపుల్లో అడియోల కలకలం కనిపించింది.

Advertisement
Advertisement