ప్రచార హోరు.. | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు..

Published Fri, Nov 17 2023 12:18 AM

- - Sakshi

జిల్లాకు వివిధ పార్టీల అగ్ర నాయకులు
● నేడు మణుగూరులో రాహుల్‌గాంధీ రోడ్‌ షో ● త్వరలో ఇల్లెందులో కేటీఆర్‌ ఎన్నికల యాత్ర ● భారీ సభ ఏర్పాట్లలో కమ్యూనిస్టు పార్టీలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఎన్నికల ప్రచారం వేడెక్కనుంది. నిన్నా మొన్నటి వరకు ప్రచార పర్వంలో భారత రాష్ట్ర సమితి ముందు వరుసలో ఉండగా.. ఇప్పుడు ఇతర పార్టీలు సైతం తమ ప్రచారంలో మరో అంకానికి తెర తీస్తున్నాయి. ఇంటింటి ప్రచారానికి తోడు ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలను ఇందులో భాగస్వాములను చేస్తున్నాయి.

నేడు రాహుల్‌ రోడ్‌ షో

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ శుక్రవారం మణుగూరులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. నేడు ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరనున్న రాహుల్‌.. నేరుగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.05 నిమిషాలకు మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆయనకు స్థానిక కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలుకుతారు. 12.15 నుంచి 1.15 గంటల వరకు ఓపెన్‌టాప్‌ వాహనంలో రోడ్‌షో, అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగే సభలో మాట్లాడుతారు. తిరిగి 1.25 నిమిషాలకు హెలికాప్టర్‌లో నర్సంపేటకు వెళ్తారు. రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో ఎస్పీ డాక్టర్‌ జి. వినీత్‌, గురువారం మణుగూరులో ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రచారానికి వస్తుండడంతో జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇతర నేతలు సైతం సభలో పాల్గొంటారు. రాహుల్‌ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు బస్‌ యాత్రలో భాగంగా కొత్తగూడెం, భద్రాచలంలో పర్యటిస్తారు.

త్వరలో కేటీఆర్‌ రాక..

భారత రాష్ట్ర సమితి తరఫున సీఎం కేసీఆర్‌ ఇప్పటికే జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలను పూర్తి చేశారు. ఆ పార్టీ తరఫున సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కొత్తగూడెంలో, ఆదివారం భద్రాచలం, ఇల్లెందులో కేటీఆర్‌ రోడ్‌షో చేపట్టనున్నట్లు మొదట షెడ్యూల్‌ విడుదలైంది. అయితే అనివార్య కారణాలతో కొత్తగూడెం, భద్రాచలంలో కేటీఆర్‌ రోడ్‌షోలు రద్దయినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇల్లెందు నియోజకవర్గానికే రోడ్‌షో పరిమితం కానుంది.

25న పవన్‌ పర్యటన ?

ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి బరిలోకి దిగుతున్నాయి. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలు జనసేనకు కేటాయించారు. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం పవన్‌ కళ్యాణ్‌ జిల్లాకు వస్తారని తెలుస్తోంది.ఈ మేరకు బీజేపీ, జసనేన నేతలు పవన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈనెల 25న కొత్తగూడెంలో పవన్‌ రోడ్‌షో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇక బీసీ సీఎం నినాదంతో పోటీకి దిగిన బీజేపీ.. ఆ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా బీసీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఓకే చోట సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. అయితే తేదీ, వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు.

కదం తొక్కనున్న కామ్రేడ్లు

ఎన్నికల పొత్తు వికటించడంతో భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో భద్రాచలంలో ఆ పార్టీకి గట్టు పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. దీంతో తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వస్తున్న ఆ పార్టీ అగ్రనేతలు ఇక్కడ ప్రచారం చేయనున్నారు. ఈనెల 20న విజయ రాఘవన్‌, 25న త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, 27న పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ప్రచారం నిర్వహించనున్నారు. ఇక కొత్తగూడెం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తుండడంతో ఆ పార్టీ అగ్రనేతలు ఇప్పటికే కొత్తగూడెం ప్రచారంలో నిమగ్నమయ్యారు.

నన్ను అడ్డుకోలేకే..

మణుగూరులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోడ్‌షో నిర్వహిస్తుండటంపై పినపాక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేగా కాంతారావు స్పందించారు. ‘ఇన్ని రోజులు నేనొక గల్లీ నాయకుడిని అనుకున్నాను. కానీ నా మీద పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం ఢిల్లీ స్థాయి నేతలు ప్రచారానికి వస్తున్నారు. గత ఐదేళ్లలో పినపాకలో జరిగిన అభివృద్ధి, ఇక్కడి ప్రజలు నా వెన్నంటి ఉన్న తీరు చూస్తే, స్థానిక నేతలు నా గెలుపును అడ్డుకోలేరని ఆ పార్టీకి అర్థమైంది. అందుకే నన్ను ఓడించేందుకు ఢిల్లీ స్థాయి నేతను రప్పిస్తున్నారు. దీన్ని బట్టి రేగా ఎంత దమ్మున్న నాయకుడో తెలుస్తోంది’ అన్నారు.

1/2

2/2

Advertisement
Advertisement