Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు | Sakshi
Sakshi News home page

Chicken: చికెన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

Published Mon, Apr 8 2024 12:10 AM

చుంచుపల్లి: మార్కెట్లో చికెన్‌ అమ్మకాలు - Sakshi

డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకనే అధిక రేటు

పండుగలు, పెళ్లిళ్లతో డిమాండ్‌

దాణా, కోడి పిల్ల, నిర్వహణ ధరలు పెరగటం మరో కారణం

ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల పెంపకానికి వెనుకంజ

 ఖమ్మం: చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. నిన్న, మొన్నటి వరకు కిలో రూ.220 నుంచి రూ.250 వరకు ఉన్న చికెన్‌ ధర ఆదివారానికి ఒక్కసారిగా పెరిగింది. ప్రాంతం, డిమాండ్‌ ఆధారంగా కిలో చికెన్‌ రూ.300 పైగానే విక్రయిస్తున్నారు. ఓ వైపు పండుగలు, మరో వైపు శుభకార్యాల సీజన్‌ కావటంతో చికెన్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. వినియోగానికి తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దాణా ధరలు, కోడిపిల్లల ధరలు పెరగటం, వేసవిలో నిర్వహణ ఖర్చులు పెరగటం కూడా చికెన్‌ ధరలు పెరగటానికి కారణాలుగా కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు.

ఉత్పత్తి పడిపోయింది..
ప్రస్తుతం చికెన్‌కు ఉన్న డిమాండ్‌కు తగిన విధంగా కోళ్ల ఉత్పత్తి జరగటం లేదు. మార్కెట్‌లో వ్యాపారుల నుంచి ఆర్డర్లు పెరగటంతో అందుకు అనుగుణంగా ఉత్పత్తులు లేకపోవటంతో కంపెనీలు రేట్లు పెంచుతున్నాయి. పరిశ్రమల వద్ద లైవ్‌ బర్డ్‌ ధర పెరగటంతో దాని ప్రభావం చికెన్‌ ధరపై పడుతోంది. నెల రోజుల కిందట తెలంగాణ కుంభమేళాగా జరిగిన మేడారం జాతరతో కోళ్లు, చికెన్‌ ధరలు పెరిగాయి. జాతర తరువాత తగ్గిన చికెన్‌ ధరలు మళ్లీ పెరిగాయి. నెల రోజులకు పైగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండటంతో మాంసాహారాల వినియోగం బాగా పెరిగింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవలి కాలంలో నిత్యం 80 నుంచి 90 టన్నుల వరకు చికెన్‌ వినియోగం జరుగుతున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు వినియోగం ఉన్నట్లు వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో 60 లక్షలకు పైగా కోళ్లను పెంచేందుకు అవకాశం ఉన్నప్పటికీ గత అనుభాలు, ఇతర కారణాలతో ప్రస్తుతం 40 నుంచి 45 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్లు కోళ్ల పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగానికి తగిన విధంగా ఉత్పత్తి లేకపోవటంతో ధర ౖపైపెకి పోతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.

పండుగలు, పెళ్లిళ్లతో..
ప్రస్తుతం హిందూ, ముస్లింల పండుగలైన ఉగాది, రంజాన్‌లు ఓ వైపు, మరో వైపు పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో చికెన్‌కు బాగా డిమాండ్‌ పెరిగింది. మంగళవారం ఉగాది పండుగ, గురు, శుక్రవారాల్లో రంజా న్‌ పండుగ ఉండటంతో చికెన్‌కు వ్యాపారుల నుంచి ఆర్డర్లు బాగా పెరిగాయి. ఇదే తరుణంలో పెళ్లిళ్లు ఉండటంతో ఆ డిమాండ్‌ కూడా కొనసాగుతోంది. శుభ ముహూర్తాల కాలం కావటంతో ప్రతి ఇంటా ఉప్పలమ్మ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో చికెన్‌కు ధరలు పెరుగుతున్నాయి. మొక్కజొన్న వంటి పంటల ఉత్పత్తి తగ్గిపోవటంతో దాణా ధర పెరిగింది. ఇక హేచరీస్‌లో కోడి పిల్లల ధర పెరిగింది. రూ.25 నుంచి రూ.30 ఉన్న కోడి పిల్ల ధర ప్రస్తుతం రూ.53గా పలుకుతోంది. ఇక నిర్వహణ ఖర్చులు పెరిగాయి. వేసవిలో కోళ్ల పరిశ్రమల నిర్వహణకు అదనంగా ఖర్చవుతుంది.

ఏసీల వినియో గం పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కోళ్లు తట్టుకోలేవు. ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కాలం కావటంతో కోళ్ల పరిశ్రమకు నష్టం జరుగుతుందని భావించి నిర్వాహకులు, రైతులు కోళ్ల పెంపకానికి వెనుకంజ వేస్తున్నా రు. ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోతే కోలుకోలేని దెబ్బ పడుతుంది. కోళ్లు సాధారణంగా 40 రోజుల్లో 2.3 కిలోల బరువు పెరుగుతుంది. కానీ, వేసవిలో 48 రోజులు పడుతుంది. ప్రస్తుతం ఒక కోడి పెంపకానికి రూ.125 నుంచి రూ.135 వరకు ఖర్చవుతోంది. కంపెనీలు ప్రస్తుతం రూ.140 వరకు విక్రయిస్తున్నాయి. దీంతో రిటైల్‌గా స్కిన్‌లెస్‌ రూ.300 నుంచి రూ.320 వరకు విక్రయిండగా, విత్‌స్కిన్‌ రూ.280 గా, లైవ్‌కోడి రూ.170 వరకు విక్రయిస్తున్నారు.

ఉత్పత్తి లేకనే..
కోళ్ల ఉత్పత్తి లేకనే చికెన్‌ ధరలు పెరిగాయి. వివిధ కారణాలతో కోళ్ల పెంపకం తగ్గింది. వేసవిలో కోళ్ల పెంపకం భారంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి. కోడిపిల్ల ధర బాగా పెరిగింది. వేసవిలో పెంపకం ఇబ్బందిగా ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరిగాయి. డిమాండ్‌ తగిన ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెంచడం అనివార్యమైంది.
– రావి బాబూరావు, పౌల్ట్రీ పరిశ్రమ యజమాని, ఖమ్మం

చికెన్‌ ధర ప్రియం
చికెన్‌ ధర ప్రియంగా మారింది. గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు ధరకు చేరింది. కిలో చికెన్‌ ధర రూ.300 కావటంతో వినియోగాన్ని తగ్గించాల్సి వచ్చింది. ప్రతి ఆదివారం చికెన్‌కు రూ.200 నుంచి రూ.220 వరకు వెచ్చిస్తాం. అలాంటిది రూ.300 పెట్టినా కేజీ రావటం లేదు. మటన్‌ ధరతోపాటు చికెన్‌ ధర కూడా అందుబాటులో లేకుండా పోతోంది.
– శీలం కార్తీక్‌, నాయుడుపేట, ఖమ్మం

Advertisement

తప్పక చదవండి

Advertisement