1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్‌ | Sakshi
Sakshi News home page

WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్‌! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్‌

Published Mon, May 1 2023 7:22 PM

1.4 crore jobs will vanish in next 5 years World Economic Forum report - Sakshi

భారత జాబ్‌ మార్కెట్‌పై ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) సంచలన నివేదిక వెలువరించింది. దేశంలో వచ్చే ఐదేళ్లలో భారత జాబ్‌ మార్కెట్‌ 22 శాతం క్షీణిస్తుందని, ప్రపంచ వ్యాప్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని ఆ రిపోర్ట్‌ పేర్కొంటోంది.

ఇదీ చదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...?

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు లేఆఫ్స్‌ అమలు చేస్తున్నాయి. అమెజాన్‌, గూగుల్‌ వంటి పెద్ద పెద్ద టెక్‌ దిగ్గజాలు సైతం వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ జాబ్‌ మార్కెట్‌పై 800కు పైగా కంపెనీలతో సర్వే నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్‌ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది.

వచ్చే ఉద్యోగాల కన్నా పోయేవే ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా 2027 నాటికి 69 మిలియన్ల (6.9 కోట్లు) కొత్త ఉ‍ద్యోగాలు వస్తాయని, ఇదే సమయంలో 83 మిలియన్ల (8.3 కోట్లు) ఉద్యోగాలు ఊడిపోతాయని డబ్ల్యూఈఎఫ్‌ సర్వే ద్వారా అంచనా వేసింది. అంటే కొత్తగా వచ్చే ఉద్యోగాల కన్నా ఊడిపోయే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తంగా 1.4 కోట్ల ఉద్యోగాలు ఊడిపోనున్నాయని డబ్ల్యూఈఎఫ్‌ నివేదిక ద్వారా తెలుస్తోంది. జాబ్‌ మార్కెట్‌ క్షీణత భారత్‌లో 22 శాతంగా ఉంటుందని అంచనా వేసిన డబ్ల్యూఈఎఫ్‌ ప్రపంచ వ్యాప్తంగా 23 శాతంగా ఉంటుందని పేర్కొంది.

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, డేటాసెట్‌ విభాగాల్లో ఉన్న 673 మిలియన్ (67.3 కోట్లు) ఉద్యోగాల్లో 83 మిలియన్ (8.3 కోట్లు) ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో తొలగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో 69 మిలియన్‌ (6.9 కోట్లు) ఉద్యోగాలు ఇవ్వనున్నాయి. ఫలితంగా 14 మిలియన్ల (1.4 కోట్లు) ఉద్యోగాలు పోతాయి. ఇది ప్రస్తుతం ఉపాధిలో 2 శాతం. ఆర్థిక వ్యవస్థ బలహీనపడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కంపెనీలు అవలంబించడమే ఇందుకు కారణమని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది. 

ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఇవే..
పెరుగుతున్న సాంకేతికత, డిజిటలైజేషన్ కారణంగా బ్యాంక్ టెల్లర్లు, క్యాషియర్‌లు డేటా ఎంట్రీ క్లర్క్‌ల వంటి క్లరికల్ ఉద్యోగాలు వేగంగా తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు, బిగ్‌ డేటా నిపుణులు, ఏఐ మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుల ఉద్యోగాలు 2027 నాటికి సగటున 30 శాతం పెరుగుతాయని అంచనా.

ఇదీ  చదవండి: ఫ్రెషర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీసీఎస్‌.. 44 వేల జాబ్ ఆఫర్లు.. అందరికీ ఉద్యోగాలు! 

Advertisement
Advertisement