కోలుకునేది రెండేళ్ల తర్వాతే | Sakshi
Sakshi News home page

కోలుకునేది రెండేళ్ల తర్వాతే

Published Sat, Aug 21 2021 4:40 AM

3. 17 lakh home sales, 2. 62 lakh launches‌ in 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  దేశీయ నివాస విభాగం 2023లో తారా స్థాయికి చేరుకుంటుంది. 3.17 లక్షల గృహాల విక్రయాలు, 2.62 లక్షల లాంచింగ్స్‌ జరుగుతాయి. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 1.8 లక్షలకు చేరుతాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ అంచనా వేసింది. గృహ రుణ వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటం, స్టాక్‌ మార్కెట్‌ వృద్ధి, ప్రభుత్వ ప్రోత్సాహకరమైన విధానాలు వంటివి ఈ వృద్ధికి కారణాలని తెలిపింది.

కొనుగోలుదారుల్లో పెరుగుతున్న విశ్వాసం, సాంకేతికత, డిజిటల్‌ మార్కెటింగ్, వినూత్న వ్యాపార పద్ధతులు దేశీయ నివాస రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలలో గతేడాది 1,38,344 యూనిట్లు విక్రయమయ్యాయని.. ఈ ఏడాది 1,79,527లకు పెరుగుతాయి. డిమాండ్‌ మాత్రం కరోనా పూర్వ స్థాయి కంటే దిగువనే ఉంటుందని తెలిపింది. 2019లో అమ్మకాలు 2,61,358 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 2,64,625 యూనిట్లు, 2023లో 3,17,550 గృహాలు విక్రయం అవుతాయని అంచనా వేసింది.

2017 నుంచి వృద్ధి..
నివాస విభాగం 2017 నుంచి ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. 2019 నాటికి తారా స్థాయికి చేరింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 2020లో డీలా పడింది. గతేడాది రెండో అర్ధ భాగం నుంచి కాస్త మెరుగైన ప్రతిభను కనబర్చినప్పటికీ ఆశించిన స్థాయికి చేరలేదు. 2020లో గృహాల విక్రయాలు 1.38 లక్షలు, లాంచింగ్స్‌ 1.28 లక్షలకు తగ్గాయి. ఈ ఏడాది డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా ఉంటుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనుజ్‌ పురి తెలిపారు. గృహాల సప్లయ్‌ 35 శాతం, విక్రయాలు 30 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. 2019తో పోలిస్తే మాత్రం సప్లయ్‌ 28 శాతం, అమ్మకాలు 31 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

సప్లయ్‌ కంటే సేల్స్‌ ఎక్కువ..
వ్యాక్సినేషన్‌ వేగవంతం కావటంతో 2023 నాటికి రియల్టీ మార్కెట్‌ పీక్‌ దశకు చేరుతుంది. 2019తో పోలిస్తే విక్రయాలలో 22 శాతం, సప్లయ్‌లో 11 శాతం వృద్ధిని నమోదు చేస్తుంది. 2014–16లో గృహాల సప్లయ్‌ 11,85,000 ఉండగా.. విక్రయాలు 8,90,500లుగా ఉన్నాయి. సేల్స్‌/సప్లయ్‌ నిష్పత్తి 0.75 శాతంగా ఉంది. అదే 2017–19 నాటికి సప్లయ్‌ 5,78,,700 ఉండగా.. అమ్మకాలు 7,20,800లకు పెరిగాయి. నిష్పత్తి 1.25 శాతానికి వృద్ధి చెందింది.

నగరంలో సేల్స్‌ 6 శాతం..
2023లో జరిగే సేల్స్, లాంచింగ్స్‌ రెండింట్లోనూ ముంబై, బెంగళూరు నగరాలు ముందంజలో ఉంటాయి. ముంబై సేల్స్‌లో 28 శాతం, లాంచింగ్స్‌లో 30 శాతం వాటాలను కలిగి ఉంటుంది. అదేవిధంగా బెంగళూరు అమ్మకాలలో 20 శాతం, ప్రారంభాలలో 17 శాతం, ఎన్‌సీఆర్‌ వరుసగా 18 శాతం, 15 శాతం, పుణే 15 శాతం, 18 శాతం, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ నగరాలు విక్రయాలలో 6 శాతం, లాంచింగ్స్‌లో 8 శాతం వాటాలను సొంతం చేసుకుంటాయి.

Advertisement
Advertisement