క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్‌ గురూ! | Sakshi
Sakshi News home page

క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్‌ గురూ!

Published Thu, Feb 24 2022 1:29 AM

Advertisers must put disclaimers for highly risky cryptos - Sakshi

ముంబై: క్రిప్టో కరెన్సీలు, నాన్‌–ఫంజిబుల్‌ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్‌ ప్రమాణాల మండలి ఏఎస్‌సీఐ మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. ఇలాంటి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లితే నియంత్రణ సంస్థలపరంగా పరిష్కార మార్గాలేమీ ఉండకపోవచ్చని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి.

క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ (వీడీఏ), నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు ఏఎస్‌సీఐ తాజా గైడ్‌లైన్స్‌ రూపొందించింది. ఈ అసెట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టమేదీ చేయకపోయినప్పటికీ.. వీటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద పన్ను వేయాలని మాత్రం ఇటీవల బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాలని ఆర్‌బీఐ  పట్టుబడుతుండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలని ప్రతిపాదించడం అనేది వీటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా భావించవచ్చని పరిశ్రమ చెబుతోంది.  

నిబంధనలు..
► ప్రింట్‌ ప్రకటనల్లో అయిదో వంతు స్థలాన్ని డిస్‌క్లెయిమర్‌ కోసం కేటాయించాలి. వీడియో ప్రకటన అయితే, ఆఖర్లో సాదా బ్యాక్‌గ్రౌండ్‌పై టెక్ట్స్‌ను సాధారణ వేగంతో వాయిస్‌ ఓవర్‌ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. వీడియో యాడ్‌లలో కనీసం అయిదు సెకన్ల పాటైనా చూపాలి. అదే రెండు నిమిషాలు పైగా సాగే ప్రకటనల్లోనైతే యాడ్‌ ప్రారంభం కావడానికి ముందు, ఆ తర్వాత ఆఖర్లోనూ చూపాలి. ఆడియో, సోషల్‌ మీడియా పోస్టులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది.
► కరెన్సీ, సెక్యూరిటీలు, కస్టోడియన్, డిపాజిటరీలు మొదలైన పదాలన్నీ నియంత్రణ సంస్థ పరిధిలోని ఉత్పత్తులుగా ప్రజలు భావించే అవకాశం ఉన్నందున వీడీఏ సాధనాలు లేదా సర్వీసుల ప్రకటనల్లో అడ్వర్టైజర్లు వీటిని వాడకూడదు.
► ఆయా సాధనాలకు సంబంధించి గత పనితీరు గురించి పాక్షికంగా కూడా చూపకూడదు. మైనర్‌లతో యాడ్స్‌ తీయకూడదు.
► భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు పెరుగుతాయనే హమీ ఇచ్చే పదజాలం వాడకూడదు.
► వీడిఏ సాధనాల్లోని రిస్కులను తగ్గించి చూపే విధంగా ప్రకటనలు ఉండకూడదు. అలాగే నియంత్రిత అసెట్స్‌తో పోల్చి చూపకూడదు.
► వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా చూసే క్రమంలో..  యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలూ ప్రకటనల్లో చెప్పే విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకుని వ్యవహరించాలి.

Advertisement
Advertisement