నిమిషాల్లో లోన్‌.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్‌! ఆనంద్‌ మహీంద్రా ప్రశంస | Sakshi
Sakshi News home page

నిమిషాల్లో లోన్‌.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్‌! ఆనంద్‌ మహీంద్రా ప్రశంస

Published Mon, Sep 4 2023 4:26 PM

Anand Mahindra Praises RBI For Its Pilot Loan Delivery Platform - Sakshi

లోన్‌ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC)ని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ బోర్డ్‌ మీటింగ్‌లో ప్రదర్శించారు. దీన్ని వీక్షించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) అద్భుతమంటూ ప్రశంసించారు. 

రుణగ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలనుకునేవారికి రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ ఈ పీటీపీఎఫ్‌సీని రూపొందించింది. ఈ ప్లాట్‌ఫామ్ రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు, ఎంఎస్‌ఎంఈలకు నాన్-కొలేటరల్ ఆధారిత రుణాలు, హోం లోన్లు, డెయిరీ రుణాలు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది.

తాజాగా ఇండోర్‌లో జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశానికి హాజరైన ఆనంద్ మహీంద్రా ఆ విశేషాలను ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ద్వారా పంచుకున్నారు. 

"కొన్నిసార్లు ముందు వరుసలో సీటు పొందడం గొప్పగా ఉంటుంది. శనివారం (సెప్టెంబర్‌ 2) ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న మాకు రిజర్వ్ బ్యాంక్  పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (PTPFC) పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. ఇది కేవైసీ ప్రక్రియలు, డాక్యుమెంట్లను సమీకృతం చేయడం ద్వారా రుణం మంజూరు చేయడానికి పట్టే సమయాన్ని రోజుల నుంచి నిమిషాలకు తగ్గిస్తుంది. 

తద్వారా గ్రామీణ కస్టమర్‌లకు క్రెడిట్ డెలివరీ మెకానిజంలో విప్లవాత్మక మార్పులను కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ఓపెన్ ప్లాట్‌ఫారమ్ దీనిని ఉపయోగించాలనుకునే అన్ని బ్యాంకులకూ అందుబాటులో ఉంటుంది. భారత్‌ మళ్లీ డిజిటల్ పోల్ పొజిషన్‌ను తీసుకుంటోంది. అభినందనలు ఆర్బీఐ" అంటూ ‘ఎక్స్‌’ పోస్టులో రాసుకొచ్చారు. పీటీపీఎఫ్‌సీ పైలట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను జత చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement