రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ | Larsen And Turbo Chairman Anil Manibhai Naik Inspiring Life Success Story In Telugu And Net Worth 2023 Details - Sakshi
Sakshi News home page

AM Naik Inspiring Success Story: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్

Published Mon, Nov 27 2023 12:45 PM

Anil Manibhai Naik Success Story  - Sakshi

ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతికత, సమాచార రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ సంస్థ పురోగతికి కారకుడైన ఏఎమ్ నాయక్ గురించి బహుశా విని ఉండక పోవచ్చు. కేవలం రూ. 760 తో మొదలైన ఈయన జీవితం.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నడిపించే స్థాయికి ఎదిగింది. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

2023 సెప్టెంబర్‌లో ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌గా పదవీవిరమణ చేసిన 'అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌' జీవితం ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది. మధ్య తరగతికి చెందిన అనిల్‌ మణిభాయ్‌.. స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది అయిన మణిభాయ్ నిచ్చాభాయ్ నాయక్ కుమారుడు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉండేవారని సమాచారం.

ముంబైకి వలస..
ఉద్యోగరీత్యా వారి కుటుంబం మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె నుంచి ముంబైకి వలస వచ్చింది. దీంతో మణిభాయ్ చదువు ముంబైలోనే సాగింది. విశ్వకర్మ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈయన.. ప్రారంభంలో ఎల్ అండ్ టీ లో ఉద్యోగం పొందలేకపోయారు. నెస్టార్‌ బాయిలర్స్‌ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకోసం చేరాడు.

జూనియర్ ఇంజినీర్.. 
'ఎల్‌ అండ్‌ టీ' కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అభిప్రాయంతో ఉన్న 'నాయక్' అతి తక్కువ కాలంలోనే జూనియర్ ఇంజినీర్ హోదాలో ఎల్‌ అండ్‌ టీ కంపెనీలో అడుగుపెట్టాడు. కంపెనీ పట్ల అతనికున్న నిబద్దత 21 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా చేసింది. అంకిత భావంతో పనిచేస్తున్న ఇతన్ని గుర్తించిన కంపెనీ అనేక ఉన్నత పదవులను అందించింది.

ఛైర్మన్‌గా..
1999లో కంపెనీకి సీఈవోగా.. 2017 జూలైలో గ్రూప్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన నాయకత్వంలో కంపెనీ ఆస్తులు 870 కోట్ల డాలర్లను పెరిగాయి. 2017 - 18లో కంపెనీ అతనికి వార్షిక వేతనంగా రూ. 137 కోట్లు చెల్లించింది. సెలవు తీసుకోకుండా పనిచేసిన పనిదినాలు కంపెనీ ఏకంగా రూ. 19 కోట్లు చెల్లించింది. మొత్తం మీద అతని మొత్తం ఆస్తి రూ. 400 కోట్లు అని సమాచారం.

ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి.. ఎవరో తెలుసా?

రూ. 142 కోట్లు దానం..
అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌ ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని అంచెలులంచెలుగా ఎదిగిన కష్టజీవి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి 2016లో తన మొత్తం ఆస్తిలో 75 శాతం (సుమారు రూ. 142 కోట్లు) విరాళంగా ఇచ్చేసాడు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ విరాళాలు అందించిన టాప్ 10 దాతల్లో నాయక్ ఒకరు కావడం విశేషం. ఈయన సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి సత్కారాలను అందించింది. 2023 మర్చి 31న దాఖలు చేసిన కార్పొరేట్ షేర్‌హోల్డింగ్‌ల ప్రకారం, నాయక్ ఆస్తి మొత్తం రూ. 171.3 కోట్లు అని తెలుస్తోంది.

Advertisement
Advertisement