యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ వచ్చేస్తోంది...

19 Sep, 2020 05:27 IST|Sakshi

భారత్‌లో సెప్టెంబర్‌ 23న ప్రారంభం

న్యూఢిల్లీ: అమెరికా టెక్‌ దిగ్గజం భారత్‌లోని ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ సెప్టెంబర్‌ 23 న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రానున్న పండుగ సీజన్‌ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఆన్‌లైన్‌ స్టోర్‌ ఆవిష్కరణతో భారత్‌లోని తమ కస్టమర్లకు మరింత చేరువవుతామని పే ర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ స్టోర్లలో లభించే ప్రీమియం అనుభవాన్ని ఈ ఆన్‌లైన్‌ స్టోర్‌ అందిస్తుందని కంపెనీ ఆశిస్తోంది.

కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్‌లైన్‌ బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నారని యాపిల్‌ చెప్పుకొచ్చింది. ఈ ఆన్‌లైన్‌ స్టోర్లలో యాపిల్‌కు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఉపకరణాలు లాంటి పూర్తి స్థాయి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ఇదే స్టోర్‌ ద్వారా దేశంలో తొలిసారిగా కస్టమర్లకు తన ప్రత్యక్ష సేవలను అందించనుంది. ఇక ఫిజికల్‌ స్టోర్‌ను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉందని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఈ ఫ్రిబవరిలో ట్విట్టర్‌ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. యాపిల్‌ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తులను థర్డ్‌ పార్టీ విక్రేతలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు