యాపిల్‌, శాంసంగ్‌ కీలక నిర్ణయం! ఇక్కడ తయారీ లేనట్లే..

1 Sep, 2023 15:51 IST|Sakshi

ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్ (Apple), శాంసంగ్ (Samsung) భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌కు ఈ రెండు టెక్ దిగ్గజాలు దరఖాస్తు చేయలేదు.

ఐటీ హార్డ్‌వేర్ పీఎల్‌ఐ స్కీమ్‌లో పాల్గొనేందుకు డెల్, లెనోవో, హెచ్‌పీతో సహా దాదాపు 40 ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అంగీకరించాయి. అయితే యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలు మాత్రం వద్దనుకున్నాయి. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆ రెండు కంపెనీలు పీఎల్‌ఐ స్కీమ్‌ను వద్దనుకోవడానికి ప్రాథమిక కారణం స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే భారతదేశంలో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్‌లకు మార్కెట్‌ చాలా తక్కువగా ఉండటమే.

ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌లో భారత్‌లో ఉన్నది కేవలం 2.4 శాతం మాత్రమే. కానీ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రం భారత్‌లో అత్యధిక మార్కెట్‌ ఉంది. పైగా యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీ ప్రధాన ఉత్పత్తులు ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు కావు. కాబట్టి చైనా, వియత్నాం వంటి దేశాల నుంచి తయారీ కేంద్రాలను భారత్‌కు తరలించడం ఆర్థికంగా అంత లాభదాయకం కాదు.

ఎక్కువ ఆదాయం వాటి నుంచే..
యాపిల్‌ కంపెనీకి ఆదాయం ప్రధానంగా ఐఫోన్‌ ఉత్పత్తుల నుంచే వస్తోంది. మాక్‌లు, ఐపాడ్‌ల నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా చాలా తక్కువ. అందువల్లే ఈ సంస్థ భారత్‌లో మాక్‌లు, ఐపాడ్‌ల తయారీకి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు శాంసంగ్‌ ప్రభుత్వ ఇన్‌వాయిస్‌లలోని వ్యత్యాసాలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఇది ఆ కంపెనీ పీఎల్‌ఐ స్కీమ్‌లో పాల్గొనకపోవడానికి కారణం కావచ్చు.

ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) PLI 2.0 స్కీమ్‌ భారత్‌లో తయారు చేసే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్‌ కంప్యూటర్లు, సర్వర్, అల్ట్రా-స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ పరికరాలతో సహా వివిధ సాంకేతిక ఉత్పత్తులను కవర్ చేస్తుంది. చాలా కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం  బడ్జెట్‌కు మించి దరఖాస్తులు వచ్చాయి.

మరిన్ని వార్తలు