ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్‌ కారు! మంత్రి కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్‌ కారు! మంత్రి కీలక ప్రకటన

Published Tue, Sep 21 2021 11:17 AM

Asia first Hybrid Car Is Ready to Launch - Sakshi

స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా సరికొత్త ఆవిష్కరణలు ఇండియాలో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏషియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్‌ కారును మార్కెట్‌లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 


వినత నుంచి
మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో ఇండియా దూసుకుపోతుంది. మరోవైపు రెండుమూడేళ్ల కిందట స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి. ఈ పరంపరలో మరో మైలురాయి దాటేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్‌ ప్రయత్నిస్తోంది, 


ఏషియాలోనే తొలిసారి
చెన్నైకి చెందిన వినత స్టార్టప్‌ రూపొందించిన ఫ్లైయింగ్‌ కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్‌ మినిస్టర్‌ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. ఫ్లైయింగ్‌ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్‌ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్‌ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్‌ కారు తయారీ పనిలో ఉంది.


గరిష్టంగా 60 నిమిషాలు
వినత రూపొందించిన ఫ్లైయింగ్‌ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్‌ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్‌, టేకాఫ్‌ అవడం ఈ కారు ప్రత్యేకత. 

బయో ఫ్యూయల్‌
ఈ హైబ్రిడ్‌ ఫ్లైయింగ్‌ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్‌ క్వాడ్‌ రోటార్‌ సిస్టమ్‌ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఎనిమిది రోటార్లలో ఒకటి చెడిపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలపైకి సురక్షితంగా ఈ ఫ్లైయింగ్‌ కారుని ల్యాండ్‌ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది. 
మెడికల్‌ ఎమర్జెన్సీలో
ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్‌ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య అన్నారు. మరోవైపు రోడ్‌ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్‌ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్‌ లాంటి సంస్థలు ఫ్లైయింగ్‌ కారు కాన్సెప్టు పట్ల ఆసక్తిగా ఉన్నాయి. 
లండన్‌లో
2021 అక్టోబరు 5న లండన్‌ వేదికగా జరగనున్న హెలిటెక్‌ ఎగ్జిబిషన్‌లో తొలిసారిగా ఈ ఫ్లైయింగ్‌ కారుని ప్రదర్శించనున్నారు. 

చదవండి: ఓలా కార్స్‌.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి !

Advertisement
Advertisement