Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త పథకాల వెల్లువ

Published Mon, Feb 5 2024 1:28 AM

Asset management companies launched 212 new fund offerings - Sakshi

న్యూఢిల్లీ: అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థలు) గతేడాది నూతన పథకాల రూపంలో ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం 212 న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)లు 2023లో మార్కెట్లోకి వచ్చాయి. ఇవి సంయుక్తంగా రూ.63,854 కోట్లను సమీకరించాయి. అంతకుముందు ఏడాది (2022) కూడా 228 ఎన్‌ఎఫ్‌వోలు రూ.62,817 కోట్లు సమీకరించడం గమనార్హం.

ఇక 2021లో రూ.99,704 కోట్లు, 2020లో రూ.53,703 కోట్ల చొప్పున కొత్త పథకాల ద్వారా సమీకరించాయి. ఈ వివరాలను ఫైయర్స్‌ రీసెర్చ్‌ విడుదల చేసింది. ‘‘వినియోగం విషయంలో మారుతున్న ధోరణి, అధిక ప్రమాణాలతో కూడిన జీవన అవసరాల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టడాన్ని గుర్తిస్తున్నారు.

అత్యవసర సమయాలను గట్టేక్కేందుకు తగినంత నిధి, ఆర్థిక ప్రణాళిక అవసరాన్ని కరోనా మహమ్మారి తెలియజేసింది’’అని ఫైయర్స్‌ రీసెర్చ్‌ తన నివేదికలో తెలిపింది. బలమైన ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన జీఎస్‌టీ వసూళ్లు, ప్రభుత్వ సంస్కరణలతో సూచీలు గతేడాది మంచి పనితీరు చూపించినప్పటికీ, 2024లోనూ అదే మాదిరి పనితీరు ఆశించరాదని పేర్కొంది. మార్కెట్‌ విలువలు ఖరీదుగా మారిన తరుణంలో అప్రమత్తత అవసరమని ఇన్వెస్టర్లకు సూచించింది.  

పెరిగిన రిస్క్‌ ధోరణి..
2023 జనవరి–మార్చి కాలంలో అత్యధికంగా 57 ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి వచ్చాయి. జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికంలో అత్యధికంగా రూ.22,049 కోట్లను ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించాయి. 2023లో 29 థీమాటిక్‌/సెక్టోరల్‌ ఫండ్స్‌ (ఎన్‌ఎఫ్‌వోలు) రూ.17,946 కోట్లను ఆకర్షించాయి. ఈక్విటీల విషయంలో ఇన్వెస్టర్లలో రిస్క్‌ తీసుకునే ధోరణి పెరగడంతో వారు థీమాటిక్‌/సెక్టోరల్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మార్కెట్‌ ర్యాలీ సమయంలో ఎన్‌ఎఫ్‌వోలు ఎక్కువగా వస్తుంటాయి. సానుకూల సెంటిమెంట్‌ నేపథ్యంలో అధిక పెట్టుబడులను సులభంగా సమీకరించొచ్చని అలా చేస్తుంటాయి. స్టాక్‌ మార్కెట్‌ మెరుగైన పనితీరుకు తోడు, ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌ గతేడాది భారీగా ఎన్‌ఎఫ్‌వోలు నిధులు సమీకరించడానికి తోడ్పడినట్టు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2023లో నిఫ్టీ–50 సూచీ 20 శాతం రాబడులను ఇచి్చంది.

ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్‌ అయితే 47 శాతం, స్మాల్‌క్యాప్‌ 56 శాతం చొప్పున ర్యాలీ చేయడం గమనార్హం. గతేడాది దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈక్విటీల ర్యాలీలో ముఖ్యపాత్ర పోషించాయి. గతేడాది మొత్తం మీద మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ రూ.2.74 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 2022లో వచి్చన రూ.71,000 కోట్లతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా వచ్చాయి.  

Advertisement
Advertisement