ఆటో ఎక్స్‌పో 2023: ఎలక్ట్రిక్‌ వాహనాలే హైలైట్‌, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి

12 Jan, 2023 09:07 IST|Sakshi

గ్రేటర్‌ నోయిడా: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్‌పో 2023 బుధవారం ప్రారంభమైంది. 2022లో జరగాల్సిన ఈ కార్యక్రమం కోవిడ్‌–19 కారణంగా వాయిదాపడింది. ఈసారి షోలో ఎలక్ట్రిక్‌ వాహనాలు హైలైట్‌. 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి ఎక్స్‌పోలో తళుక్కుమంటున్నాయి. వీటిలో మారుతీ 5 డోర్‌ జిమ్మీ, నెక్స్‌ట్‌ జనరేషన్‌ కియా కార్నివల్, ఎంజీ ఎయిర్‌ ఈవీ, టాటా పంచ్‌ ఈవీ, హ్యుందాయ్‌ అయానిక్‌–5 ఉన్నాయి.  జనవరి 18 వరకు ప్రదర్శన ఉంటుంది. 

 సుజుకీ ఈవీఎక్స్‌ 550 కిలోమీటర్లు
వాహన తయారీ దిగ్గజం జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్‌ ఎలక్ట్రిక్‌ మధ్యస్థాయి ఎస్‌యూవీ ‘ఈవీఎక్స్‌’ తొలిసారిగా అంతర్జాతీయంగా దర్శనమిచ్చింది. 2025లో ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టనుంది. 60 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్‌ తోషిహిరో సుజుకీ వెల్లడించారు. మొత్తం 16 వాహనాలను మారుతీ ప్రదర్శిస్తోంది. వీటిలో వేగన్‌–ఆర్‌ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్‌–సీఎన్‌జీ, గ్రాండ్‌ విటారా ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ వంటివి ఉన్నాయి.  

హ్యుందాయ్‌: అయానిక్‌–5 ఈవీ ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్‌లో ధర తొలి 500 మంది కస్టమర్లకు రూ.44.95 లక్షలు. 72.6 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీతో 217 హెచ్‌పీ ఎలక్ట్రిక్‌ మోటార్‌ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయానిక్‌–6 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ సైతం కొలువుదీరింది. 53, 77 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

ఎంజీ: హెక్టర్, హెక్టర్‌ ప్లస్‌ ఫేస్‌లిఫ్ట్‌ కొలువుదీరాయి. ఆల్‌ ఎలక్ట్రిక్‌ మిఫా 9 ఎంపీవీ తొలిసారిగా భారత్‌లో తళుక్కుమన్నది. దీనిలో 90 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఉంది. 440 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్‌ ఎంజీ–4 హ్యాచ్‌బ్యాక్, ఎంజీ 5 ఎలక్ట్రిక్‌ స్టేషన్‌ వేగన్‌ (ఎస్టేట్‌), ఈఎంజీ6 హైబ్రిడ్‌ సెడాన్‌ సైతం ప్రదర్శనలో ఉంది.  

బీవైడీ: సీల్‌ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను ఆవిష్కరించింది. 2023 చివరి త్రైమాసికంలో రానుంది.

లెక్సస్‌: ఎల్‌ఎం 300హెచ్‌ ఎంపీవీ (టయోటా వెల్‌ఫైర్‌) భారత్‌లో అడుగుపెట్టింది. హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో రూపుదిద్దుకుంది. 150 హెచ్‌పీ, 2.5 లీటర్‌ అట్కిన్సన్‌ సైకిల్‌ పెట్రోల్‌ ఇంజన్‌ ఏర్పాటు ఉంది. కొత్త ఆర్‌ఎక్స్‌ ఎస్‌యూవీ భారత్‌లో ప్రవేశించింది. ఎల్‌ఎఫ్‌–30, ఎల్‌ఎఫ్‌–జడ్‌ ఈవీ కాన్సెప్ట్‌ మోడళ్లు ఉన్నాయి.

టయోటా: ల్యాండ్‌ క్రూజ్‌ ఎల్‌సీ 300 ఎస్‌యూవీ కొత్త రూపులో చమక్కుమంటోంది.   బీజడ్‌4ఎక్స్‌ భారత్‌లో అడుగుపెట్టింది. 71.4 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది.

టాటా: అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ హ్యారియర్‌ ఈవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 2024లో మార్కెట్లోకి రానుంది. డ్యూయల్‌ మోటార్, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ ఉంది. 2025లో రంగ ప్రవేశం చేయనున్న సియర్రా ఈవీ కాన్సెప్ట్‌ సైతం మెరిసింది.

చదవండి: ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు