బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టం 864 కోట్లు | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టం 864 కోట్లు

Published Tue, Aug 11 2020 12:10 AM

Bank of Baroda posts net loss of Rs 864 crore in Q1 - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) రూ. 864 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండిబాకీలు మొదలైనవాటికి అధిక కేటాయింపులు జరపాల్సి రావడమే ఇందుకు కారణం. ‘ప్రామాణిక ఖాతాలకు రూ. 1,811 కోట్ల మేర ప్రొవిజనింగ్‌ చేయాల్సి రావడం వల్ల స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ1లో రూ. 864 కోట్లు, కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ. 679 కోట్ల నికర నష్టం నమోదైంది‘ అని బ్యాంక్‌ వెల్లడించింది.

సమీక్షాకాలంలో వడ్డీ ఆదాయం రూ. 18,944 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ. 18,494 కోట్లకు తగ్గింది. అటు కేటాయింపులు 71 శాతం పెరిగి రూ. 3,285 కోట్ల నుంచి రూ. 5,628 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 10.28 శాతం నుంచి 9.39 శాతానికి తగ్గడంతో అసెట్‌ క్వాలిటీ కాస్త మెరుగుపడింది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 3.95 శాతం నుంచి 2.83 శాతానికి తగ్గింది. సోమవారం బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు స్వల్పంగా పెరిగి రూ. 48.55 వద్ద క్లోజయ్యింది.

Advertisement
Advertisement