ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్‌... | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు సవాళ్లున్నాయ్‌...

Published Sat, Dec 25 2021 12:38 AM

BofA expects 8. 2percent GDP growth for India in FY23 - Sakshi

ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన సాధారణీకరణ, వినియోగ డిమాండ్‌ రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఎన్నో సవాళ్లున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా తెలిపింది. జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందొచ్చని, ఇంతకంటే తగ్గే రిస్క్‌లు కూడా ఉన్నట్టు పేర్కొంది. సాగు రంగం స్థిరంగా 4 శాతం మేర వృద్ధి సాధించడం, సేవల రంగం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా తెలిపింది.

స్థూల అదనపు విలువ (జీవీఏ) 2021–22లో 8.5 శాతం అంచనా నుంచి 2022–23లో 7 శాతానికి, జీడీపీ వృద్ధి 2021–22లో అంచనా 9.3 శాతం నుంచి 2022–23లో 8.2 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ పేర్కొంది. త్రైమాసికం వారీగా వృద్ధిలో హెచ్చుతగ్గులు ఉంటాయని నివేదికలో వివరించింది. 2022–23 మొదటి క్వార్టర్‌లో రెండంకెల వృద్ధి నమోదవుతుందని, నాలుగో త్రైమాసికంలో వార్షికంగా చూస్తే తక్కువ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం వ్యవస్థలో లిక్విడిటీ ఎక్కువగా ఉండగా.. దీన్ని సాధారణీకరించే దిశగా, ద్రవ్యోల్బణం నియంత్రణ దిశగా ఆర్‌బీఐ తీసుకునే చర్యలు, వినియోగ డిమాండ్‌పై పడే ప్రభావం జీడీపీ వృద్ధి అంచనాలను మరింత కిందకు తీసుకెళ్లే అంశాలుగా తెలిపింది.

వినియోగంపై వడ్డీ రేట్ల ప్రభావం..
‘‘బ్యాంకుల రుణ వితరణలో వృద్ధి 6 శాతంగా ఉంటే.. రిటైల్‌ రుణాలకు డిమాండ్‌ బలంగా 12 శాతం మేర ఉంది. మానిటరీ పాలసీ సాధారణీకరించినట్టయితే రుణ రేట్లు పెరగొచ్చు. ఇది వినియోగ డిమండ్‌ను దెబ్బతీస్తుంది’’ అని బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా పేర్కొంది. బలహీన రుతుపవనాల రూపంలోనూ మరో రిస్క్‌ ఉన్నట్టు తెలిపింది. 2022–23 సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.  

Advertisement
Advertisement