2021–22లో సిమెంటుకు డిమాండ్‌ | Sakshi
Sakshi News home page

2021–22లో సిమెంటుకు డిమాండ్‌

Published Wed, Jan 13 2021 7:14 PM

Cement Demand Expected to Grow by up to 20 Percent: ICRA - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ అమ్మకాలు తిరిగి పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22లో పరిశ్రమలో 18–20 శాతం డిమాండ్‌ వృద్ధికి ఆస్కారం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2018–19, 2019–20 స్థాయికి పరిశ్రమ చేరుతుందని తెలిపింది. ఇక్రా ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌కుతోడు అందుబాటు గృహాలు, మౌలిక రంగం తిరిగి గాడిన పడనుండడం ఈ పెరుగుదలకు కారణం. ఖర్చుల వైపు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆపరేటింగ్‌ మార్జిన్స్‌ 20–21 శాతం స్థాయిలో ఉండొచ్చు. 20–22 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం కొత్తగా తోడు కానుంది. 2020–21లో ఇది 15–17 మిలియన్‌ టన్నులు.

తూర్పు ప్రాంతం నుంచే 15–17 మిలియన్‌ టన్నులు జతకూడే అవకాశం ఉంది. ప్లాంట్ల వినియోగం గతేడాది ఉన్న 56 శాతం నుంచి 2021–22లో 64 శాతానికి చేరనుంది. పెట్‌ కోక్‌ ధరలు కొన్ని నెలల క్రితం పెరిగాయి. డీజిల్‌ ధరలూ అధికమవుతున్నాయి. సకాలంలో రబీ నాట్లు పడడం, నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో ఉత్పదకత మెరుగై.. సెంటిమెంటు సానుకూలం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంటుకు డిమాండ్‌ ఉంటుందని ఇక్రా ఏవీపీ అనుపమ రెడ్డి తెలిపారు. రియల్టీ, పీఎంఏవై–అర్బన్, ఇన్‌ఫ్రా రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ 3.0 ప్యాకేజ్‌ సిమెంట్‌ డిమాండ్‌ను నడిపిస్తుందని వివరించారు. 

చదవండి: హైదరాబాద్‌లో 39 వేల గృహాల ఇన్వెంటరీ

Advertisement
Advertisement