ఓఎన్‌జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!

1 Apr, 2022 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

 రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్‌ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్‌ చేసింది. గురువారం(31) ఆఫర్‌ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్‌ కనిపించింది. 

వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. ఈ బిడ్స్‌ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్‌కు అధిక డిమాండ్‌ కనిపిస్తే గ్రీన్‌షూ ఆప్షన్‌కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్‌లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు