మీ పేర్లలో ‘బ్యాంక్‌’ను తగిలించొద్దు

23 Nov, 2021 01:43 IST|Sakshi

మీ పేర్లలో ‘బ్యాంక్‌’ను తగిలించొద్దు

సహకార సంఘాలకు ఆర్‌బీఐ స్పష్టీకరణ

అలాంటి సొసైటీల పట్ల అప్రమత్తత పాటించాలని ప్రజలకు సూచన

ముంబై: సహకార సంఘాలు తమ పేర్లలో ‘బ్యాంక్‌’ ను జోడించుకోవద్దని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం స్పష్టం చేసింది. తమ పేర్లలో ‘బ్యాంక్‌’ను తగిలించుకోవడం, సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడే సహకార సొసైటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్‌ 29 నుంచీ అమలులోకి వచ్చిన బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ 1949 సవరణ చట్టం ప్రకారం సహకార సంఘాలు తమ పేర్లలో భాగంగా ‘బ్యాంక్‌‘, ‘బ్యాంకర్‌‘ లేదా ‘బ్యాంకింగ్‌‘ అనే పదాలను నిబంధనల ఉల్లంఘించి వినియోగించరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్ట నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సహకార బ్యాంకులు తమ పేర్లలో ‘బ్యాంక్‌’ పదాన్ని జోడించుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది.

సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు సేకరించవద్దు..
కొన్ని సహకార సంఘాలు సభ్యులు కానివారు/ నామమాత్రపు సభ్యులు/ అసోసియేట్‌ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నాయని పేర్కొన్న ఆర్‌బీఐ,  ఇది నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకింగ్‌ వ్యాపారం చేయడంతో సమానమని స్పష్టం చేసింది. సహకార సొసైటీలకు బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1949 కింద ఎటువంటి లైసెన్స్‌లు జారీ కాలేదని,  వాటికి బ్యాంకింగ్‌ వ్యాపారం చేయడానికి  ద్వారా అధికారం లేదని పేర్కొంది. ఈ సొసైటీలలో ఉంచిన డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌– క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) నుండి బీమా రక్షణ కూడా  అందుబాటులో ఉండదని పేర్కొంది. ఏదైనా సొసైటీ ‘బ్యాంక్‌’ అని క్లెయిమ్‌ చేసుకుంటే, అటువంటి సహకార సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.  ఆయా సొసైటీలతో లావాదేవీలు నిర్వహించే ముందు ఆర్‌బీఐ జారీ చేసిన బ్యాంకింగ్‌ లైసెన్స్‌ ఏమిటన్నది పరిశీలించాలని కూడా సూచించింది. ఆ తరహా సొసైటీల కార్యకలాపాలను తన దృష్టికి తీసుకురావాలని పేర్కొంది.  

మరిన్ని వార్తలు