Sakshi News home page

Adani-Hindenburg Case: సుప్రీంకోర్టు తీర్పు.. కాంగ్రెస్‌ కీలక వ్యాఖ్యలు

Published Thu, Jan 4 2024 4:02 PM

Congress Response On Court Verdict About Adani Stocks Issue - Sakshi

ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ అదానీ గ్రూప్‌ స్టాక్‌ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు పూర్తిగా సెబీకి అనుకూలంగా ఉందని తెలిపింది. అదానీ గ్రూప్‌ కంపెనీలపై ఆరోపణలు వచ్చిన తర్వాత కోర్టు సమగ్ర విచారణ చేయమని ఆదేశించి పది నెలలు అయిందని గుర్తుచేసింది. అయినా సెబీ తన దర్యాప్తును పూర్తి చేయడంలో విఫలమైందని పార్టీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

అదానీ గ్రూప్‌ కంపెనీలపై వచ్చిన 24 పిటిషన్లకుగాను 22 పిటిషన్ల దర్యాప్తు పూర్తి చేసిన నిపుణుల కమిటీ మరో మూడు నెలల్లో సమగ్ర విచారణ పూర్తి చేయాలని సెబీని ఆదేశించిన విషయం తెలిసిందే. దానిపై కాంగ్రెస్‌పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జీ జైరాం రమేష్ స్పందిస్తూ లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం తప్పా రాబోయే మూడు నెలల్లో ఏమార్పురాదన్నారు. అయితే సెబీను ప్రశ్నించేందుకు వార్తా నివేదికలు, మీడియా కథనాలు ప్రత్యామ్నాయం కాదనే విషయంపట్ల అత్యున్నత​ న్యాయస్థానం తీర్పుతో ఏకీభవించారు.

ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌ నివేదిక.. సుప్రీంకోర్టు తీర్పు.. అదానీ ఏమన్నారంటే..

ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు బుధవారం వెలువరించిన తీర్పులో సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని చెప్పింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్‌ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్దీవాలా, మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది.

Advertisement

What’s your opinion

Advertisement