రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్‌ | Sakshi
Sakshi News home page

రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్‌

Published Sat, Dec 31 2022 6:18 AM

COVID-Driven Recession Impact on Retail Industry - Sakshi

న్యూఢిల్లీ: దేశీ రిటైల్‌ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్‌ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు.

సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్‌ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్‌ ఇండియా కన్సల్టింగ్‌ పార్ట్‌నర్‌ రజత్‌ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్‌ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ చెప్పారు. ఓఎన్‌డీసీ (డిజిటల్‌ కామర్స్‌ కోసం ఓపెన్‌ నెట్‌వర్క్‌) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్‌ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు.  

ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి ..
2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్‌ (కన్జూమర్‌ ప్రోడక్ట్స్, రిటైల్‌) అంశుమన్‌ భట్టాచార్య తెలిపారు.  

ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే ..
► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్‌ రిటైల్‌ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్‌ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్‌ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్‌ రిటైల్‌ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్‌ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్‌ ఖోస్లా (ఏజేఎస్‌కే), పర్పుల్‌ పాండా ఫ్యాషన్స్‌ మొదలైన పలు ఫ్యాషన్స్‌ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్‌ కంపెనీ యాడ్‌వర్బ్‌లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది.
► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్‌ కేటగిరీలో ఎనిమిది డిజిటల్‌ ఫస్ట్‌ లైఫ్‌స్టయిల్‌ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది.  
► ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు విస్తరించే
దిశగా వీ–మార్ట్‌ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది.  
► దేశీ రిటైల్‌ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్‌ రిటైల్‌ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది.

Advertisement
Advertisement