సగటున వేతన పెంపు 9.1 శాతం | Sakshi
Sakshi News home page

సగటున వేతన పెంపు 9.1 శాతం

Published Thu, Mar 3 2022 6:23 AM

Deloitte survey pegs average salary increment in India at 9. 1 percent - Sakshi

న్యూఢిల్లీ: వేతన జీవులకు ఈ ఏడాది అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి కల్పించిన ప్రతికూలతలతో గత రెండేళ్లుగా మంచి వేతన పెంపు అన్నది ఉద్యోగులకు లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది సగటున 9.1 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా తెలిపింది. ఈ సంస్థ ‘2022 వర్క్‌ఫోర్స్‌ అండ్‌ ఇంక్రిమెంట్స్‌ ట్రెండ్స్‌’ పేరుతో సర్వే నిర్వహించింది. 2021లో సగటు వేతన పెంపు 8 శాతంగా ఉంది. కరోనాకు ముందు 2019లో వేతన పెంపుతో పోల్చినా ఈ ఏడాది అర శాతం అధికంగా ఉంటుందన్న అంచనాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి.

‘‘2020లో కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లింది. దాంతో వేతన పెంపులు తగ్గిపోవడం, వేతన కోతలు, నియామకాలు నిలిచిపోవడం వంటివి చూశాము. 2021లో వేతన పెంపులు పుంజుకున్నాయి. వేతన కోతలు కనిపించలేదు. కరోనా ప్రత్యేక ప్రయోజనాలు అమల్లోకి వచ్చాయి. 2022లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, నియామకాలు పెరగడం, ఉద్యోగుల వలసలు వంటి పరిస్థితులతో కంపెనీలు వేతన పెంపుల విషయంలో కరోనా ముందు నాటి స్థాయిని దాటిపోనున్నాయి. ప్రోత్సాహకాలు ఇచ్చి నైపుణ్యం కలిగిన వారిని నిలుపుకోవాల్సిన పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి’’ అని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ ఆనందరూప్‌ ఘోష్‌ తెలిపారు. ఈ సర్వేలో 450 సంస్థలు పాల్గొన్నాయి.

నివేదికలోని వివరాలు..  
► 34 శాతం సంస్థలు రెండంకెల వేతన పెంపులు ఇవ్వనున్నట్టు తెలిపాయి. 2021లో ఇలా చెప్పిన కంపెనీలు 20 శాతమే ఉంటే, 2020లో 12 శాతంగా ఉంది.  
► అన్ని ప్రముఖ రంగాల్లోనూ వేతన పెంపులు ఈ ఏడాది అధికంగా ఉంటాయి.
► లైఫ్‌ సైన్సెస్, ఐటీ రంగాల్లో అధికంగాను, ఫైనాన్స్‌ టెక్నాలజీ, ఐటీ ప్రొడక్ట్‌ కంపెనీలు, డిజిటల్‌/ఈకామర్స్‌ కంపెనీలు రెండంకెల పెంపును ఇవ్వనున్నాయి.  
► వేతన ప్రోత్సాహకాలు అందరికీ ఒకే మాదిరిగా కాకుండా.. వారి పనితీరు ఆధారంగా ఇవ్వనున్నట్టు 92 శాతం కంపెనీలు తెలిపాయి. సగటు పనితీరు చూపించే వారితో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించే వారికి 1.7 రెట్లు అధికంగా పెంపు ఇవ్వనున్నట్టు చెప్పాయి.
► జూనియర్‌ స్థాయిల్లోని వారికి ఎక్కువగాను, అధిక వేతన స్థాయిల్లోని వారికి తక్కువగాను పెంపు ఉండనుంది.
► ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) 2020లో 15.8 శాతంగా ఉంటే 2021లో 19.7 శాతానికి పెరిగింది.  
► వలసలకు చెక్‌ పెట్టేందుకు అధిక వేతన పెంపుతోపాటు, ఒక విడత బోనస్‌ వంటి ప్రయోజనాలను ఇచ్చే ఉద్దేశ్యంతో కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు నైపుణ్య శిక్షణపై పెట్టుబడి పెట్టనున్నాయి.
► 2022లో 90 శాతానికి పైగా కంపెనీలు బోనస్‌ ఇవ్వాలనుకుంటున్నాయి.  


ఉద్యోగిపై పెరగనున్న వ్యయం  
‘‘2022లో 9.1 శాతం వేతన పెంపు అన్నది ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకే. అదనపు నియామకాలు, ఒక్క విడత వేతన దిద్దుబాట్లు, రిటెన్షన్‌ బోనస్‌లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీద ఉద్యోగిపై చేసే వ్యయం పెరిగిపోనుంది’’ అని డెలాయిట్‌ పార్ట్‌నర్‌ అనుభవ్‌ గుప్తా తెలిపారు. మధ్య నుంచి దీర్ఘకాలానికి ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార వృద్ధిపైనే వేతన పెంపులు ఆధారపడి ఉంటాయని అంచనా వేశారు.   

Advertisement
Advertisement