Dream11 Founder and CEO Harsh Jain Success Story - Sakshi
Sakshi News home page

నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి అయ్యాడు

Published Tue, Apr 4 2023 8:25 PM

Dream11 founder harsh jain success story - Sakshi

చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుని గురించి చదువుతుంటే కొంత ఆశ్చర్యం కలిగేది, ఎందుకంటే బేతాళున్ని తీసుకురావడానికి విక్రమార్కుడు మళ్ళీ మళ్ళీ చెట్టు దగ్గరికి వెల్తూనే ఉంటాడు. అయితే చివరికి అనుకున్నది సాధిస్తాడు. సరిగ్గా ఈ కథను పోలిన జీవితాన్ని హర్ష్ జైన్ అనుభవించాడు.

1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ ప్రాథమిక విద్యను గ్రీన్‌లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్‌బాల్ వంటి వాటిలో పాల్గొన్నాడు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది.

(ఇదీ చదవండి: రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..)

నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు.

2013లో హర్ష్ జైన్ డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు, వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్‌లో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించారు. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది.

(ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్‍ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్)

2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు.

Advertisement
Advertisement