కష్టాల్లో స్టార్టప్‌: గుడ్‌బై చెప్పిన కో-ఫౌండర్‌

2 Oct, 2023 17:56 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ఆన్-డిమాండ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ డన్జోకు భారీ షాక్‌ తగిలింది. లిక్విడిటీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి కంపెనీకి గుడ్‌బై చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్  మద్దతున్న స్టార్టప్‌ భారీ పునర్నిర్మాణ ప్లాన్‌ ప్రకటించిన తరువాత నలుగురు సహ వ్యవస్థాపకులలో ఒకరైన దల్వీర్ సూరి  సంస్థ నుంచి  నిష్క్రమించడం చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని డన్జో  CEO కబీర్ బిస్వాస్ సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. సూరి కొంత కాలంగా విరామం తీసుకోవాలని భావిస్తున్నారని, సరికొత్తగా ముందుకు సాగాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ త్రైమాసికం నుండే వ్యాపార పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొన్ని మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.  (కిర్రాక్‌ కుర్రోడు: రూ. 45 వేలకే ‘రోల్స్‌ రాయిస్‌’! వైరల్‌ వీడియో)


  
2015 మే నుంచిస్టార్టప్ కంపెనీకి కో-ఫౌండర్‌గా సూరి ఆరేళ్లకు పైగా పనిచేశారు.  అలాగే డంజో మర్చంట్ సర్వీసెస్ (DMS)తో సహా కొత్త వ్యాపారాలను పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.  కాగా  గత కొన్ని నెలలుగా నిధుల  సమీకరణం కోస  కష్టపడుతోంది. ఈ కష్టాల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కంపెనీ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. నగదు కొరతతో సతమతమవుతున్న ఈ సంస్థకు నిధులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. వీటన్నింటికి తోడు  నష్టాలను చవిచూస్తోంది. జీతాలు చెల్లించడానికి కూడా డబ్బు లేదు.  జీతాల చెల్లింపులను పలుమార్లు వాయిదా వేసిన సంస్థ గత నెలలో, Dunzo ఆగస్టు నెల జీతాలకుగాను పేరోల్ ఫైనాన్సింగ్ కంపెనీ OneTapతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఈ కంపెనీ రెండో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన గూగుల్ , బకాయిలు చెల్లించమని కోరుతూ  కంపెనీకి లీగల్ నోటీసు పంపిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయవచ్చు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ నీలెన్సో , గూగుల్‌ కలిపి దాదాపు రూ.4 కోట్లు బకాయినోటీసులిచ్చాయి.

అయితే ఎపుడు  సూరి  పదవీకాలం ముగిసేది, అతని స్థానంలో ఎవరు రాబోతున్నారనేది వెల్లడించలేదు. సూరి, బిశ్వాస్‌తోపాటు  అంకుర్ అగర్వాల్ , ముకుంద్ ఝా కంపెనీ  ఇతర సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. అయితే ఈ నలుగురిలో బిస్వాస్‌కు మాత్రమే కంపెనీలో 3.57 శాతం ఈక్విటీ  వాటా ఉంది.  సూరికి ఈక్విటీ లేదు జీతం కూడా లేని కారణంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు  Dunzo ఇప్పటివరకు Reliance, Google, Lightrock, Lightbox, Blume Ventures ఇతర కంపెనీల నుంచి 2015 నుండి దాదాపు 500 మిలియన్‌ డాలర్లను సేకరించింది. రిలయన్స్ కంపెనీలో 25.8 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. ప్రైవేట్ మార్కెట్ డేటా ప్రొవైడర్ Tracxn ప్రకారం, ప్రస్తుతం Dunzoలో 19 శాతం యాజమాన్యంతో Google రెండో అతిపెద్ద వాటాదారు. డంజో దాదాపు రూ.250 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు  చేస్తోంది.

మరిన్ని వార్తలు