ఆశావహంగా ఆదాయాల రికవరీ

31 Aug, 2021 08:49 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాపారాలను సులభతరంగా నిర్వహించడమనేది క్షేత్ర స్థాయిలో ఇప్పటికీ కష్టతరంగా ఉండటం, వ్యాపార నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం ప్రైవేట్‌ రంగం ఆకాంక్షలను దెబ్బతీస్తోందని కార్పొరేట్లు భావిస్తున్నారు. అయితే, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రకటనలతో 2021–22లో కంపెనీల పనితీరు మెరుగుపడగలదని ఆశిస్తున్నారు. 

పరిశ్రమల సమాఖ్య సీఐఐ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సుమారు 117 మంది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవో) ఇందులో పాల్గొన్నారు. 2019–20 (కరోనా పూర్వం) ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆదాయాలు 10 శాతం వృద్ధి చెందగలవని 46 శాతం మంది సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

వృద్ధి సాధన మీద ప్రైవేట్‌ కంపెనీల్లో ఉండే కసిపై క్షేత్ర స్థాయి సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 51 శాతం మంది సీఈవోలు పేర్కొన్నారు. పెట్టుబడి కాకుండా వ్యాపార నిర్వహణకు అయ్యే ఇతరత్రా వ్యయాలు భారీగా ఉంటున్నాయని 32 శాతం మంది సీఈవోలు తెలిపారు.

మరిన్ని వార్తలు