Black Hole: హ్యాట్సాఫ్‌ ఐన్‌స్టీన్‌.. ఆయన ఊహే నిజమైంది

29 Jul, 2021 14:06 IST|Sakshi

Astronomers Detect Light Behind Black Hole: విశ్వంలో మనిషి మేధస్సుకు అంతుచిక్కని రహస్యాలెన్నో. వాటిలో బ్లాక్‌ హోల్‌ ఒక సంక్లిష్టమైన సబ్జెక్ట్‌. అదృశ్య ప్రాంతాలుగా కంటికి కనిపించకుండా.. ఖగోళ వస్తువులన్నింటినీ తమలోకి ఆకర్షించుకునే కేంద్రాలివి. అయితే కృష్ణ బిలాల వెనుక ఉన్న ఓ విషయాన్ని తొలిసారి ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించగా, ఐన్‌స్టీన్‌ అంచనా ఆయన మేధోసంపత్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. 

భూమికి 100 మిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో కృష్ణ బిలం(ఐ జ్విక్కీ 1) వెనకాల కాంతి ప్రతిధ్వనుల్ని(తేలికపాటి) గుర్తించారు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ(అమెరికా) పరిశోధకులు. మెరుపుల్లా మొదలై అటుపై రంగు రంగుల్లోకి మారిపోయాయి ఆ ఎక్స్‌రే కాంతులు. సాధారణంగా బ్లాక్‌ హోల్‌లోకి వెళ్లిన కాంతి ఏదీ బయటకు పరావర్తనం చెందదు. దీంతో ఆ వెనకాల ఏముంటుందో అనేది ఇప్పటిదాకా ఖగోళ శాస్రజ్ఞులు నిర్ధారించుకోలేకపోయారు. అయితే ఈ బిలం చుట్టేసినట్లు ఉండడం, కాంతి వంగి ప్రయాణించడం, అయస్కాంత క్షేత్రాలు మెలిదిరిగి ఉండడం వల్లే ఈ కాంతి ప్రతిధ్వనులను రికార్డు చేయగలిగామని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ ఆస్ట్రో ఫిజిస్ట్‌ డాన్‌ విల్కిన్స్‌ వెల్లడించారు.
 
ఐన్‌స్టీన్‌ ఏనాడో చెప్పాడు
జర్మన్‌ మేధావి, థియోరెటికల్‌ ఫిజిసిస్ట్‌ ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ ఈ విషయాన్ని ఏనాడో గుర్తించాడు. కృష్ణ బిలం వెనకాల కాంతి కిరణాల పరావర్తనాలు సాధ్యమని, అంతరిక్షంలో భారీవేవైనా సరే వక్రీకరణ చెందక తప్పవని ‘జనరల్‌ రియాల్టివిటీ’ పేరుతో ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ టైంలో ఆ థియరీని ఎవరూ పట్టించుకోలేదు. అయితే తాజా పరిశోధనల గుర్తింపుతో ఆయన మేధస్సును నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా సాధారణ టెలిస్కోప్‌ల ద్వారా గుర్తించడం విశేషం. నేచర్‌ జర్నల్‌లో బుధవారం ఈ మేరకు ఈ ఖగోళ అద్భుతంపై కథనం పబ్లిష్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు